తొర్రూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రైతులకు సరఫరా సరఫరా చేసేది. కానీ గత ఏడేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్‌లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు.
2018 నుంచి నిలిచిన సరఫరా..
వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై టార్పాలిన్లు అందించేది. కానీ గత ఏడేళ్లుగా ఒక్క టార్పాలిన్ కూడా రైతులకు సబ్సిడీ కింద అందడం లేదు. వ్యవసాయశాఖకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో కంపెనీలు ఒప్పందం చేసుకుని గతంలో టార్పాలిన్లు అందిస్తుండేది. మండలాల వారీగా వ్యవసాయాధికారులు ఇచ్చే ఇండెంట్‌ను బట్టి సరఫరా జరిగేది. రైతులు డీడీ, పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అందించి టార్పాలిన్లు కొనుగోలు చేసేవారు. మార్కెట్‌లో రూ.2,500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీతో రూ.1,250కే అందించేలా ఏర్పాట్లు చేశారు. రవాణా చార్జీలతో కలిపి రూ.1,300 నుంచి రూ.1,500 వరకు రైతులకు అందించేవారు. స్థానిక వ్యవసాయాధికారులు రైతుల వివరాలను కంపెనీలకు ఇస్తారు. ఆ సమాచారం ద్వారా 50 శాతం నిధులు సబ్సిడీ నిధులు కంపెనీలకు సర్కారు చెల్లించేది. ఆ ప్రకారం 2018 వరకు టార్పాలిన్లను అందించారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కంపెనీలు ముందస్తుగా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. పాతవి చిరిగిపోవడంతో కొత్తవి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా ప్రస్తుతం రైతులను అకాల వర్షాలు గుబులు పుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లను సరఫరా చేసి భరోసా కల్పించాలని కోరుతున్నారు.
●
కొనాలంటే అప్పు చేయాల్సిందే..
రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. కల్లాలు లేకపోవడంతో పంట ఆరబోసుకోవడం సమస్యగా మారింది. కొన్నేళ్లుగా ప్రభుత్వం టార్పాలిన్లు అందించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో మాదిరిగా రాయితీపై సరఫరా చేసి ఆదుకోవాలి. లేదంటే అప్పు చేసి కొనుగోలు చేయడం భారంగా మారుతుంది. – బానోతు పాపాలాల్,
మక్క రైతు, హచ్చుతండా
రాయితీపై అందించి ఆదుకోవాలి
యంత్రంతో కోసిన వరి ధాన్యాన్ని వారం రోజుల పాటు కల్లంలో ఆరబెట్టి తేమశాతం తగ్గించాల్సి ఉంటుంది. ఆ సమయంలో టార్పాలిన్లు లేక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం రాయితీపై పరదాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. బయట కొనుగోలు చేసేవి నాసిరకంగా ఉంటున్నాయి.
– శామకూరి ఐలయ్య, రైతు, తొర్రూరు
టార్పాలిన్లు లేక రైతుల ఆందోళన
ఏడేళ్లుగా సబ్సిడీపై అందించని వైనం
బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు
కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న అన్నదాతలు


