నామినేటెడ్ పదవుల్లో దక్కని చోటు
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీకోసం పనిచేసి.. నామినేటెడ్ పదవులు వస్తాయని భావించిన నాయకులకు నిరాశ మిగిలింది. గిరిజన జనాభా ఎక్కువ ఉండడంతో ఎస్టీ రిజర్వేషన్ కేటాయింపులే ఎక్కువగా ఉంటాయి. దీంతో నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్నవారికి రాష్ట్ర అధినాయకత్వం శ్రీమొండిచెయ్యిశ్రీ చూపింది. కాగా, చివరి ప్రయత్నంగా పీఏసీఎస్, మిగిలిన రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు కల్పించాలని నేతలను కోరుతున్నారు.
కొందరికే అవకాశం..
పోస్టులు తక్కువ.. నాయకులు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో నామినేటెడ్ పోస్టులే దిక్కుగా మారాయి. మహబూబాబాద్, డోర్నకల్ నుంచి ఎమ్మెల్యే టికెట్‌కోసం ప్రయత్నించిన ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ ట్రైకార్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అదే విధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి చివరి వరకు టికెట్ వస్తుందని ఆశపడిన నెహ్రూనాయక్ టికెట్ రాక నిరాశతో ఉన్న పరిస్థితిలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. అదే విధంగా అనూహ్యంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సతీమణి ఉమకు జిల్లా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. వీరితోపాటు ఇటీవల ప్రకటించిన జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్‌గా వెన్నం శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నూనావత్ రాధను నియమించారు. అదే విధంగా రాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యుడిగా రావుల మురళి నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. వీరితోపాటు మానుకోట తొర్రూరు, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకం చేపట్టారు.
ఆశించి భంగపడి..
ముఖ్యమైన పదవులు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఎంతోకాలంగా నామినేటెడ్ పదవులనే నమ్ముకొని ఉన్న కొందరు నాయకులకు భంగపాటే మిగిలింది. ప్రధానంగా మహబూబాబాద్ పట్టణంలోని పలు వురు నాయకులు నామినేటెడ్ పదవులు వస్తాయని భావించారు. పార్టీలోని పదవులు వస్తాయని ముందు భావించినా అదీ రాలేదు. తర్వాత కార్పొరేషన్ పదవుల్లో మొండిచెయ్యి చూపారు. పార్టీలోని ప్రధా న నాయకుల అనుచరులుగా చెలామణి అవుతూ అంతా ఆర్భాటం చేసినా.. పదవులు దక్కలేదు. అ యితే ఇందుకు కారణాలు ఒకరు ఒకరికి దగ్గర అంటే.. మరొకరు మరొకరికి దగ్గరగా ఉండడంతోనే పదవులు రాలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లోని నాయకులు కూడా పదవులు వస్తాయని భావించినా వర్గపోరుతో వెనుకబడిపోయారు.
భవిష్యత్‌పై ఆశలు
ప్రతీసారి పదవులు వస్తాయని భావించిన నాయకులకు భంగపాటు తప్పడం లేదు. దీంతో చివరి ప్రయత్నంగా పీఏసీఎస్ చైర్మన్లు, దేవాలయాల చైర్మన్లతోపాటు, రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవు లపై ఆశగా ఉన్నారు. వీటితోపాటు జనరల్ రిజర్వు అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికోసం పార్టీలోని సీనియర్ నాయకులు, వారి వారసులు ఎదురు చూస్తున్నారు. అయి తే అవి ఎప్పుడు భర్తీ చేస్తారో.. వీరి ఆశలు ఎప్పుడు చిగురిస్తాయో.. అసలు పదవులు వస్తాయో.. రావో అనే చర్చ జరుగుతోంది.
ఆశపడి భంగపడిన పలువురుజిల్లా కాంగ్రెస్ నాయకులు
పీఏసీఎస్, రాష్ట్రస్థాయి డైరెక్టర్ పోస్టులపై ఆశలు


