ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

భానుపురి (సూర్యాపేట) : స్థానికంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ, ఆదాయ వనరులను పెంచుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో.. తూర్పు తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానాయాదవ్‌, సభ్యుడు ఎస్‌.సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాసీ్త్రయ దృక్పథంతో పనిచేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో ప్రతీ నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు పర్యవేక్షణ చేయాలన్నారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్థానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌తో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డీపీఓలు, ఎంపీడీఓలు, నగర మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య

సూర్యాపేటలో స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు

Advertisement
 
Advertisement
Advertisement