ఓరుగల్లునుంచే రైతుపోరు | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లునుంచే రైతుపోరు

May 7 2026 10:02 AM | Updated on May 7 2026 10:02 AM

ఓరుగల్లునుంచే రైతుపోరు

సాక్షిప్రతినిధి, వరంగల్‌/కాజీపేట అర్బన్‌:

‘రైతుకు ఓపిక నశిస్తే భూకంపం పుడుతుందని పాలకులు గ్రహించాలి. భూమిని దున్నడం తెలిసిన రైతు నాగలి తిరగేసి కాంగ్రెస్‌ను బొంద పెడతారు.. వరంగల్‌ వేదికగా ఏ ఉద్యమం మొదలుపెట్టినా విజయవంతమవుతుంది. ఇప్పుడు జరిగిన ఈ రైతు సంగ్రామ సదస్సు ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్‌ హంటర్‌ రోడ్డులో బుధవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతుల మృతికి సంతాపంగా తొలుత ఒక నిమిషం మౌనం పాటించి, నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. జై కేసీఆర్‌ నినాదాలతో సదస్సు ప్రాంగణం మార్మోగింది. ‘కేసీఆర్‌ సారు మళ్లీ రావాలి. రైతు బంధు రాజ్యం రావాలి. రాబందుల పాల న పోవాలి’ అంటూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు నినదించారు. కాగా, కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ వైఫల్యాలు, ప్రభుత్వ తీరును కేటీఆర్‌ తన ప్రసంగంలో ఎండగట్టారు. రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. సదస్సుకు హాజరైన పలువురు రైతులు, రైతు ప్రతినిధులు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై తమ అభిప్రాయాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. సదస్సులో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. రైతు సంగ్రామ సదస్సు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. సదస్సులో గాయకులు మధుప్రియ, మిట్టపల్లి సురేందర్‌, రసమయి బాలకిషన్‌ పాటలతో హోరెత్తించారు.

ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లబండి..

రైతు సంగ్రామ సదస్సు ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన కంకులతో రూపొందించిన పసుపు చీరను కట్టుకున్నట్లుగా ఎడ్లబండి, నాగలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు ఎడ్ల బండి, నాగలి వద్ద సెల్ఫీలు దిగారు.

వేసవి తాపానికి అంబలి..

దాహానికి మజ్జిగ, మంచినీళ్లు

సదస్సుకు వచ్చిన రైతులకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 10 వేల మంది రైతులకు తెలంగాణ వంటకాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి స్టాల్‌ను ఏర్పాటు చేసి దాహార్తి తీర్చారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరింత ఉధృతం చేస్తామన్న కేటీఆర్‌

జై కేసీఆర్‌.. సారు మళ్లీ రావాలి నినాదాలతో మార్మోగిన రైతు సంగ్రామ సదస్సు

పాటలతో హోరెత్తించిన మధుప్రియ, మిట్టపల్లి సురేందర్‌, రసమయి

అభిప్రాయాలు, కష్టాలు పంచుకున్న రైతులు.. పలు రైతు తీర్మానాలకు ఆమోదం

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టిన నేతలు.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌

Advertisement
 
Advertisement
Advertisement