మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వీయగణనతో సమయం ఆదా అవుతోంది. జిల్లాలో కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో స్వీయ గణనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే స్వీయ గణన చేసి మ్యాపింగ్‌కు వచ్చే సరికి వేరే జిల్లాగా నమోదు కావడంతో.. జిల్లా ఆ సంఖ్యను కోల్పోవాల్సి వస్తోంది. అధికారుల శ్రమ వృథా అవుతోంది.
7,74,549 మంది జనాభా
జిల్లాలో 2011లెక్కల ప్రకారం 7,74,549 మంది జనాభా, 1,95,889 గృహాలు ఉన్నాయి. వాస్తవానికి 2021లో జనగణన చేయాలి. కానీ కోవిడ్, పలు ఇతర కారణాల వల్ల గణన ఆలస్యమైంది. 2026 గణన ప్రక్రియ చేపట్టారు. ఈమేరకు జిల్లాలో 26 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణాంకాలు కీలకం. అందుకు జన గణనకు కసరత్తు చేపట్టింది.
ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తి..
ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు మొత్తం 1,673 మంది ఉండగా.. అదనంగా పదిశాతంతో కలిపితే 1,702 మంది ఉన్నారు. వారంతా ఉపాధ్యాయులే. కాగా 26మంది మాస్టర్ ట్రైనర్లచే శిక్షణ ఇచ్చారు. గత నెల 18నుంచి ఈనెల 5వ తేదీ వరకు శిక్షణ పూర్తి చేశారు. ముందుగా స్వీయ గణనతో ప్రారంభమైంది. కలెక్టర్ స్నేహ శబరీష్ శ్రద్ధ పెట్టి స్వీయగణనపై విలేకరుల సమావేశం నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు.
గత నెల 26 నుంచి..
గత నెల 26 నుంచి స్వీయ గణన కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, అన్నిశాఖల ప్రభుత్వ అధి కారులు, ప్రజాప్రతినిధులు, సంఘాలు, ఉపాధ్యాయ, ఇతర యూనియన్లకు అవగాహన కల్పించారు. ప్రముఖల ఇంటికి వెళ్లి వారితోనే సీపీఓ అధికారులు స్వీయ గణన చేయిస్తున్నారు. ఈనెల 10తో స్వీయ గణన పూర్తి అవుతుంది.
మంచి స్పందన..
స్వీయ గణనను మొబైల్ ఫోన్‌లో ప్రత్యేక యాప్‌లో 33 కాలమ్‌లలో వివరాలు నమోదు చేయాలి. కేవలం ప్రాథమిక సమాచారం కోసం స్వీయ గణన చేపట్టారు. కాగా, ఈనెల 4వ తేదీ వరకు 3,238 కుటుంబాలు స్వీయగణన చేసుకున్నాయి.
టెక్నికల్ సమస్యతో..
వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి ఎక్కువ మంది అధికారులు మానుకోట జిల్లాలో పనిచేస్తున్నారు. కాగా జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో సీపీఓ అధికారులు స్వీయగణన చేయించినప్పటికీ టెక్నికల్ సమస్యతో వివరాలు వేరే జిల్లాల్లో నమోదు అయ్యాయి. మ్యాపింగ్ వచ్చే సరికి వేరే జిల్లాలో నమోదు అయ్యాయి. దీంతో అధికారుల శ్రమ వృథా అవుతోంది.
2027లో జనగణన..
స్వీయగణన ఇంటింటి సర్వే పూర్తి అయిన తర్వాత 2027 ఫిబ్రవరి, మార్చిలో జనగణన చేపడుతారు. ఆ ఏడాది మే నెలలో జనాభా లెక్క తెలుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తుంది. దీనిపైనే పథకాల అమలు, ఇతర అన్ని ఆధారపడి ఉంటాయి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేయనున్నారు.
స్వీయ గణనకు సహకరించాలి
స్వీయ గణనకు ప్రజలు సహకరించాలి. దీంతో సమయం ఆదా అవుతుంది. ఎన్యుమరేటర్లకు సులువుగా ఉంటుంది. వివరాలు అన్ని సక్రమంగా తెలియజేయాలి. ఈసారి డిజిటల్ విధానంలో గణన చేస్తారు. ప్రభుత్వ పథకాల అమలుకు గణన కీలకం కానుంది.
– వల్లూరి శ్రీనివాసరావు, సీపీఓ
కార్యక్రమంపై విస్తృత ప్రచారం
స్వీయగణనతో సమయం ఆదా
ఈనెల 10తో ముగియనున్న ప్రక్రియ
నేటి వరకు 3,238 కుటుంబాలు పూర్తి
ఈనెల 11 నుంచి ఇంటింటి సర్వే..
ఎన్యుమరేటర్లు ఈనెల 11నుంచి జూన్ 9వరకు ఇంటింటి సర్వే చేస్తారు. ఈనెల 11,12,13 తేదీల్లో ఇంటి నంబర్లు వేసుకుంటారు. ఈ సర్వేలో కేవలం కుటుంబ యాజమాని పేరు, ఇల్లు, మరుగుదొడ్డి ఇతర వివరాలతో 33 కాలమ్‌లు ఉంటాయి. ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. ఇళ్ల సర్వే మాత్రమే పూర్తి చేయనున్నారు.


