దంతాలపల్లి: గ్రామాల్లో ఆర్‌ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ అన్నారు. ఇటీవల వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన నేపథ్యంలో మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వెంకటేశ్వర మెడికల్ హాల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు పరిమితి మేరకే వైద్యం చేయాలన్నారు. ఇష్టం వచ్చినట్లు వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవన్నారు. బాలుడి మృతిపై కమిటీ వేసి పూర్తి నివేదికను అందజేయాలని మండల వైద్యాధికారి కవితను ఆదేశించారు. సూపర్‌వైజర్ కవిత తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ రైతు వారోత్సవాలు
నెహ్రూసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలు ఈ నెల 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. అందులో భాగంగా నేడు వ్యవసాయ కేంద్రాలు–సౌర విద్యుత్ కేంద్రాలు (పీఎం కుసుము) అంశంపై రైతు వేదికల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంట వరకు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. రైతులకు సౌర విద్యుత్ అధారిత సాగు విధానాలు, విద్యుత్ భద్రతలపై అవగాహన కల్పిండచం ముఖ్య ఉద్దేశమన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు పాల్గొని రైతులకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని కోరారు.
డీజీపీని కలిసిన ఎంపీ
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ.ఆనంద్‌ను మానుకోట ఎంపీ పోరిక బలరాంనాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి బొకే అందజేశారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
నర్సింహులపేట: పోలీస్‌స్టేషన్‌లో ప్రజలకు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పరికరాలు, రికార్డులను తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. కేసుల నమోదు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై బానోతు వెంకన్న ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఐదు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు పదో తరగతి పాసైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ప్రాంతీయ సమన్వయకర్త రత్నకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు జిల్లాలోని విద్యార్థులకు సమీపంలో ఉన్న ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయాలని, కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, జాగ్రఫి కోర్సు ల గ్రూపులు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని ఆర్సీఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


