ఎరువు.. బరువు! | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. బరువు!

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

గీసుకొండ: యాసంగి సీజన్‌ ముగింపు దశలో ఉంది. వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కంపెనీలు ఇదే అదునుగా భావించి ఎరువుల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డీలర్లకు ఆయా కంపెనీల వారు పెంచుతున్న ఎరువుల ధరల గురించి సమాచారం ఇస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రైతులపై మోయలేని విధంగా ఆర్థిక భారం పడనుంది. గ్రామాల్లో ఒకవైపు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల పేరిట సదస్సులు నిర్వహిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మేలైన రకాలను సాగుచేసి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకోవాలని సూచిస్తున్నారు. మరో వైపు రైతు నెత్తిన మరింత పెట్టుబడి భారాన్ని మోపుతూ కంపెనీలు ఎరువుల ధరలను పెంచుతున్నాయి. రకాన్ని బట్టి కొన్ని రసాయన ఎరువులపై రూ.75 నుంచి రూ.350 వరకు ఒక్కో బస్తాకు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరిగాయని అంటున్నారు. సరుకును రవాణా చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం, ఇతర పన్నులు ఎక్కువ కావడంతో సహజంగానే ఎరువుల ధరలు పెరిగాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

యాప్‌తో రైతులకు ఇబ్బందులు..

ప్రస్తుతం ముగుస్తున్న యాసంగి సీజన్‌ ప్రారంభంలో సకాలంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులు అధికంగా వాడుతున్నారని ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను తీసుకురావడంతో ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ.1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని డీలర్లు విక్రయించడానికి ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ.265 ఉండగా మొన్నటి వరకు రూ.300 వరకు విక్రయించారు.

పశుసంపద తగ్గిపోవడంతో..

గ్రామాల్లో పశు సంపద తగ్గిపోయింది. దీంతో పేడ, గొర్రె ఎరువు, పెంట తదితర కంపోస్టు ఎరువులతోపాటు సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉంటోంది. రైతులు తమ పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా వానాకాలంలో వరి, పత్తి, కందులు, జొన్నలు, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన ఎరువులను కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరలతో రైతులపై మరింత భారం పడుతుంది.

ఎరువుల పాత, కొత్త ధరల వివరాలు..

ఎరువు రకం పాత ధర కొత్త ధర

(50 కిలోలు) (రూపాయల్లో) (రూపాయల్లో)

20–20–013 1,500 1,800

16–20–013 1,400 1,750

14–35–14 2,150 2,350

15–15–15–09 1,650 1,950

10–23–26 1,950 2,025

సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ 615 775

పొటాష్‌ 1,850 1,975

16–16–16 1,675 2,050

24–24–0 2,000 2,300

వానాకాలం సాగు వేళ పెరిగిన ధరలు

రైతులపై మరింత పెట్టుబడి భారం

పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావమే కారణం

Advertisement
 
Advertisement
Advertisement