● బోర్నపల్లిలో ఘటన
టేకుమట్ల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామానికి చెందిన అప్పని లింగయ్య (50) ఆదివారం ఉదయం బైక్‌పై పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. సాయంత్రం స్వగ్రామం రామకృష్ణాపూర్ (వి)కు వస్తుండగా బోర్నపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో లింగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమూల్య తెలిపారు.
బయ్యారం: తవేరా, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సంతులాల్‌పోడు తండాకు చెందిన గుగులోత్ సందీప్(18) గంధంపల్లిలోని సెల్‌షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో స్కూటీపై రాత్రి ఇంటికి వస్తున్నాడు. గంధపల్లిలో తవేరా, స్కూటీ ఎదురెదురుగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై ప్రశాంత్‌బాబు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం తీరును పరిశీలించారు.
అనుమానాస్పదస్థితిలో మరొకరు ..
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్‌కు చెందిన శనిగరం శ్రీకాంత్ (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాంత్ ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబీకులు 2న మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎలికేశ్వరం శివారులో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. దీనిని పోలీసులు శనిగరం శ్రీకాంత్ మృతదేహంగా గుర్తించారు. శ్రీకాంత్ మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని, తండ్రి సాంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.పవన్‌కుమార్ తెలిపారు.


