దాచిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని..
హసన్‌పర్తి: దాచిపెట్టమని ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని ఓ మరదలు.. తన బావను కత్తితో దాడి చేసి చంపింది. హసన్‌పర్తి మండలం సిద్ధాపురంలో హత్యకు గురైన బాల్నె మొగిలి(78) కేసులో నిందితురాలైన మరదలు ఇందిరను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మొగిలిని హత్య చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలిపారు. ఆమె నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాపురానికి చెందిన వంగ ఇందిరకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆమె భర్తనుంచి విడాకులు పొందింది. ఆ సమయంలో వచ్చిన రూ.60వేలను ఇందిర తన బావ బాల్నె మొగిలికి దాచిపెట్టమని ఇచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలని అడిగితే మొగిలి రేపు ఇస్తా.. మాపు ఇస్తానని చెబుతూ విషయాన్ని దాటవేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఇందిర అక్క అయిన మొగిలి భార్య సరోజన మృతిచెందింది. నగరంలో ఉపాధి కోసం వెళ్లిన మొగిలి తిరిగి సిద్ధాపురానికి వచ్చాడు. ఈక్రమంలో డబ్బుల విషయమై ప్రస్తావన వచ్చినప్పనటికీ మొగిలి తిడుతూ బయటికి వెళ్లిపోవాలని ఇందిరను బెదిరించాడు. ఇక లాభం లేదని భావించిన ఇందిర.. బావ మొగిలిని హత్య చేయడానికి పథకం రచించింది. మంగళవారం తెల్లవారుజామున మొగిలి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి ఆవరణలోకి వెళ్లగా అప్పటికే కాపుకాసిన ఆమె ఒకేసారి అతనిపై దూకి కత్తితో దాడి చేసింది. ఘటనలో మొగిలి అక్కడక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈక్రమంలో బుధవారం వంగపహాడ్‌లోని ఓఆర్‌ఆర్ వద్ద ఇందిర ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. అనంతరం రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
బావను చంపిన మరదలు
కాలకృత్యాలు తీర్చడానికి వెళ్లగా
కత్తితో దాడి
నిందితురాలు అరెస్ట్..కత్తి స్వాధీనం
వివరాలు వెల్లడించిన
హసన్‌పర్తి ఇన్‌స్పెక్టర్ చేరాలు


