దొంగల హల్‌చల్..
పాపయ్యపేట చమన్‌లో
రూ.2 లక్షలకుపైగా..
మానుకోట బస్టాండ్‌లో భారీ చోరీ..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో దంపతుల వద్ద నుంచి దుండగులు రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లడానికి మరిపెడ బంగ్లాలో బస్సు ఎక్కి మహబూబాబాద్ బస్టాండ్‌లో దిగారు. కొంత సమయం తర్వాత నర్సంపేట వెళ్లడానికి మరో రెండు బస్సుల్లో ఎక్కగా అందులో ప్రయాణికుల రద్దీ ఉండడంతో దిగారు. కొంత సమయానికి హనుమకొండ వెళ్లే బస్సు ఎక్కిన అనంతరం శోభన్ తన జేబులో ఉన్న 2 తులాల బంగారు నెక్లెస్, 1.05 తు లాల చైన్, 4 తులాల వెండి ఆభరణాలను చూడగా కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ శోభన్, మంజుల దంపతులు బస్సు దిగి పోలీసులకు తెలుపగా టౌన్ ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తమ మనమరాలు మొదటి పుట్టిన రోజు వేడుకలు నర్సంపేటలో ఉండగా ఆ చిన్నారి కోసం 2 తులాల నెక్లెస్, 1.05 తులాల చైన్, 4 తులాల వెండి ఆభరణాలు తీసుకుని వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బాధితులు రోదిస్తూ తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మట్టెవాడలో..
రామన్నపేట : వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని ఎస్‌ఎస్‌కే సేవా సమాజ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, బాధితురాలు దాసు విజయ కథనం ప్రకారం.. విజయ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారం, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు అపహరించారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీగారంలో హుండీ ..
పాలకుర్తి: మండలంలోని తీగారం గ్రామ దుర్గమ్మ ఆలయంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు హుండీని అపహరించారు. ఈ ఘటనలో సుమారు రూ. 30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ నిర్వహణను చూసుకునే ముదిరాజ్ కులస్తులు పేర్కొన్నారు.
రామన్నపేట : వరంగల్ పాపయ్యపేట చమన్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి రూ. 2.10 లక్షలపైగా విలువైన ఆభరణాలు అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చమన్‌కు చెందిన స్వర్ణకారుడు తంగళ్లపల్లి రవీందర్‌రావు తన కోడలి ప్రసవం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం తిరిగి ఇంటికి రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా మొత్తం రూ.2 లక్షలకుపైగా విలువైన బంగారం, వెండి, రూ. 10 వేల నగదు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగించి గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంగలు హల్‌చల్ చేశారు. బుధవారం పలుచోట్ల తాళం వేసి ఉన్న ఇళ్లతోపాటు రద్దీ ప్రదేశాల్లో చోరీలకు పాల్పడ్డారు. లక్షలాది రూపాయలు విలువైన బంగారం, వెండి, నగదు అపహరించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


