పరీక్షల వేళ.. ప్రవేశాల టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

పరీక్షల వేళ.. ప్రవేశాల టార్గెట్‌

Feb 26 2026 8:40 AM | Updated on Feb 26 2026 8:40 AM

పరీక్షల వేళ.. ప్రవేశాల టార్గెట్‌

పరీక్షల వేళ.. ప్రవేశాల టార్గెట్‌

న్యూశాయంపేట : సాధారణంగా విద్యాసంవత్సరం ఆఖరు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలలు విద్యారంగానికి అత్యంత కీలకం. ఒక వైపు పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్‌ థియరీ పరీక్షలు జరుగుతుంటాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తుంటాయి. అయితే ఈ రెండింటికి మధ్య సమన్వయం లోపించడంతో క్షేత్రస్థాయి యంత్రాంగం(ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉపాధ్యాయులు, సిబ్బంది) తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థలు (టెమ్రిస్‌)లో వింత పరిస్థితి నెలకొంది. సాధారణంగా మే, జూన్‌ నెలల నుంచి చేపట్టే అడ్మిషన్ల డ్రైవ్‌ ఇప్పటి నుంచే నిర్వహించాలని.. రోజూ ఎన్ని అడ్మిషన్లు అయ్యాయో నివేదిక పంపాలని ఆదేశించడం గందరగోళానికి దారి తీస్తోంది.

అడ్మిషన్ల టార్గెట్లతో..

ఉన్నతస్థాయి అధికారులు కేవలం అంకెలు మాత్రమే చూస్తున్నారు.. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా అడ్మిషన్ల టార్గెట్‌లు విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ హోరులో ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో అడ్మిషన్లు తీసుకురావడం ఉద్యోగులకు సవాల్‌గా మారింది. నిర్ణీత సమయంలోగా అడ్మిషన్లు పెరగక పోతే మెమోలు జారీ చేస్తామని, ఇంక్రిమెంట్లు ఆపుతామని హెచ్చరించడంతో ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ల కోసం ప్రచారం చేయాల్సి వస్తోంది. ఫలితంగా బోధన నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబాలకు సమయం కేటాయించకపోవడంతో వ్యక్తిగత సమస్యలు తలెత్తున్నాయని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పరీక్షల స మయంలో అడ్మిషన్ల ఒత్తిడి తగ్గించి పది, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాల కోసం పని చేసే వాతావరణం కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

అడ్మిషన్ల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలి

ప్రభుత్వ ఒత్తిడిని ఉన్నతాధికారులు కేత్రస్థాయికి మళ్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఫలితాలు కావాలంటున్నారు. దీంతో ప్రవేశాల కోసం ఇంటింటికీ తిరిగి బతిమిలాడే పరిస్థితి వచ్చిందని క్షేత్రస్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. పరీక్షల వేళ ఈ ఒత్తిడి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పరీక్షలు ముగిసే వరకు అడ్మిషన్ల కోసం సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. టార్గెట్‌ల పేరుతో ఉద్యోగులు, సిబ్బందిని భయభ్రాతులకు గురిచేసే మెమోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యావ్యవస్థలో మార్పు రావాలంటే అడ్మిషన్ల ప్రక్రియను పరీక్షలు పూర్తయ్యాక పకడ్బందీగా చేపట్టాలని పేర్కొంటున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి తప్ప పరీక్షల విధులకు ఆటంకం కలిగించొద్దని కోరుతున్నాయి.

ఇప్పటి నుంచే అడ్మిషన్ల డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశాలు

మైనార్టీ గురుకులాల

విద్యాసంస్థల్లో వింత పరిస్థితి

ఫలితంగా ఒత్తిడిలో క్షేత్రస్థాయి

యంత్రాంగం

ప్రెజర్‌ తగ్గించాలని కోరుతున్న

ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement