చీఫ్‌ ఇంజనీర్‌ అక్రమాలు? | - | Sakshi
Sakshi News home page

చీఫ్‌ ఇంజనీర్‌ అక్రమాలు?

Feb 26 2026 8:40 AM | Updated on Feb 26 2026 8:40 AM

చీఫ్‌ ఇంజనీర్‌ అక్రమాలు?

చీఫ్‌ ఇంజనీర్‌ అక్రమాలు?

హన్మకొండ: ఓ చీఫ్‌ ఇంజనీర్‌ అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారం టీజీ ఎన్పీడీసీఎల్‌లో కలకలం సృష్టించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ, డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించింది. ఆ తర్వాత సీనియర్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు (చీఫ్‌ ఇంజనీర్లు)ను ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లుగా నియమించింది. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న చీఫ్‌ ఇంజనీర్‌ ఉన్నత స్థాయి హోదాలో ఉండి అక్రమాలు, అవకతవకలకు పాల్పడడం విద్యుత్‌ ఉద్యోగ వర్గాల్లో దుమారం లేపుతోంది. ఈ అధికారి పూర్వ చరిత్ర కూడా అక్రమాలు, అవకతవకలతో కూడుకుందని ప్రచారం జరుగుతోంది.

రూ.22 వేలు ఫైనల్‌?

ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా ‘సదర్‌’ అధికారి కొనసాగుతున్న కాలంలో 2024, సెప్టెంబర్‌ 4 నుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు నకిలీ మెడికల్‌ బిల్లులు సృష్టించి సొమ్ము కాజేశారని ఆరోపణలున్నాయి. రూ.1.30 లక్షలకు బిల్లులు కంపెనీకి సమర్పించగా స్క్రూట్నీ అనంతరం రూ.22 వేలు ఫైనల్‌ చేసినట్లు సమాచారం. దీంతో పాటు ఇదే సమయంలో మరో ఆస్పత్రిలో కంటి చికిత్స చేసుకున్నట్లు మెడికల్‌ బిల్లు సమర్పించినట్లు తెలిసింది. అయితే కంటి ఆస్పత్రి బిల్లుపై పెద్దగా సందేహాలు వ్యక్తం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఈ అధికారి కుమారుడు వైద్యుడిగా పని చేయడంతో అక్కడే చికిత్స పొందినట్లు సులువుగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు విద్యుత్‌ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రూ.వేల కోసం కక్కుర్తి..

వచ్చే నెల ఉద్యోగ విరమణ చేయనున్న ఈ చీఫ్‌ ఇంజనీర్‌ నెలకు రూ.6 లక్షలకు పైగా వేతనం తీసుకుంటున్నట్లు తెలిసింది. రూ. లక్షల్లో జీతం తీసుకుంటు న్న ఈ అధికారి రూ.వేల కోసం కక్కుర్తికి పాల్పడడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ అధికారి ఆస్పపత్రిలో చేరి చికిత్స పొందినట్లు నకిలీ బిల్లులు పొందిన సమయంలో విధుల్లో ఉండి అద్దె వాహనం వాడుకున్నట్లు రికార్డుల్లో ఉన్నట్లు తెలిసింది. ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌గా ఉన్న వారు సెలవులో ఉంటే కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌కు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో అధికారికంగా సెలవుల్లో వెళ్లారా లేదా అనే అంశంపై టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం అధికారులు పూర్తి స్థాయి పరిశీలన చేస్తున్నారు. మరో వైపు ఎన్పీడీసీఎల్‌ విజిలెన్స్‌ విభాగం కూడా విచారణ సాగిస్తోంది. ఈ అధికారి గత చరిత్ర కూడా ఘనంగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వర్క్‌ ఆర్డర్‌ పూర్తి చేయకుండానే

బిల్లులు కాజేత..

సత్తుపల్లి అసిస్టెంట్‌ డివిజన్‌ ఇంజనీర్‌గా, కామారెడ్డి డీఈగా పని చేసిన కాలంలో వర్క్‌ ఆర్డర్‌ పూర్తి చేయకుండా బిల్లులు కాజేశారనే ఆరోపణలున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలతో పాటు ప్రస్తుతం వచ్చిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యుత్‌ ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికై నా ఎన్పీడీసీఎల్‌ సీఎండీ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని విద్యుత్‌ ఉద్యోగులు కోరారు. ఈ విషయమై టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను వివరణ కోరగా జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేయనున్నట్లు చెప్పారు.

నకిలీ మెడికల్‌ బిల్లులతో

రీయింబర్స్‌మెంట్‌

2024 సెప్టెంబర్‌లో ఆస్పత్రిలో

చేరకుండానే రూ.1.30 లక్షలకు బిల్లులు

రూ.22 వేలు చెల్లింపులు..?

టీజీ ఎన్పీడీసీఎల్‌లో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement