అడిషనల్ కలెక్టర్ తనిఖీ
మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ఉన్నత పాఠశాలను అడిషనల్ కలెక్టర్ లెనిల్ వత్సల్ టొప్పో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పఠనం చేయించి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. విద్యార్థుల ఫ్రీ ఫైనల్ పరీక్షల మూల్యాంకనం చేసిన పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు చేశారు. ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ విజయానంద్, పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బయగాని రామ్మోహన్, ఎంపీఓ సోమ్లానాయక్, ఆర్‌ఐ శరత్‌చంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆకస్మిక తనిఖీ
కురవి: మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేయనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని డీఈఓ వి.రాజేశ్వర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గదులు, డ్యూయల్ డెస్క్ బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, టాయిలెట్స్, తదితర సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాల కాంపౌండ్ వెలుపల క్లాక్ రూంను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే మధ్యాహ్నం భోజనం వండడాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎండీ వాహిద్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, కురవి, సీరోలు ఎంఈఓలు వి.బాలాజీ, లచ్చిరాంనాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏడీ రాజేశ్వర్ బదిలీ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడీ, డీఈఓగా విధులు నిర్వహిస్తున్న వి.రాజేశ్వర్ ఖమ్మం జిల్లా విద్యాశాఖ ఏడీగా బుధవారం బదిలీయ్యారు. అయితే, ఆయన మహబూబాబాద్ డీఈఓగా కొనసాగుతూనే.. ఖమ్మంలో ఏడీగా విధులు నిర్వర్తిస్తారని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తొర్రూరు పీఏసీఎస్ సీఈఓ సస్పెన్షన్
తొర్రూరు: తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఆర్థిక అవతవకలు జరిగిన నేపథ్యంలో సీఈఓ మురళిని సస్పెండ్ చేస్తూ డీసీఓ వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా సహకార అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. దాదాపు రూ.89లక్షల బకాయిలు రికవరీ చేయకపోవడం, నాబార్డు మార్గదర్శకాలకు విరుద్ధంగా మేనేజ్‌మెంట్ ఖర్చులు అధిక వ్యయం చేయడం, 2021–22 నుంచి 2024 వరకు ఆడిట్ రిపోర్టుల్లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడం, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం వంటి లోపాలు బయటపడ్డాయి. ఈ మధ్యంతర ఆడిట్‌లో మాజీ డైరెక్టర్లు చేసిన ఆరోపణలు నిజమని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సీఈఓను బాధ్యుడిగా పేర్కొంటూ వేటు వేసినట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో 2026–27 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–09–2017 నుంచి 31–08–2018 మధ్య జన్మించిన వారై ఉండాలని, ఆసక్తిగల విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోని ఎంపికలో పాల్గొనాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు ఎంపికలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అడిషనల్ కలెక్టర్ తనిఖీ


