‘ఈ–నామ్’లో సాంకేతిక సమస్య..
కేసముద్రం/మహబూబాబాద్ రూరల్ : ఈ–నామ్ విధానంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల రైతులు పడిగాపులు పడిన ఘటన జిల్లాలోని కేసముద్రం, మానుకోట మార్కెట్ యార్డుల్లో బుధవారం జరిగింది. రెండు మార్కెట్లకు రైతులు తమ ధాన్యం, కందులు, పత్తి, మిర్చి తదితర వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేందుకు తీసుకువచ్చారు. అయితే ఎప్పటిలాగే ఈ–నామ్ విధానంలో లాట్ ఐడీలు ఇవ్వాల్సి ఉండగా.. కొత్తగా 2.0 వెర్షన్ సాఫ్ట్‌వేర్ అమలు చేయాలని ఆదేశాలు రావడంతో రైతుల సెల్‌ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్, చిరునామా వంటి వివరాలు నమోదు చేస్తుండగా సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో లాట్ ఐడీలు జారీ కాలేదు. రైతులంతా గంటల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చింది.
కేసముద్రంలో..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు 200మంది రైతులు తమ పంట ఉత్పత్తులు తీసుకొచ్చారు. ఈ–నామ్ విధానంలో సమస్యతో సాయంత్రం 4గంటలకు మార్కెట్ అధికారులు, వ్యాపారులతో వేలం పాటలు నిర్వహించి, మాన్యువల్‌గా ధరలు నమోదు చేశారు. రాత్రి వరకు కాంటాలు నిర్వహించారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది.
మానుకోటలో..
మానుకోట వ్యవసాయ మార్కెట్‌లో ఈ–నామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో సాయంత్రం 5గంటల వరకు 339మంది రైతులకు లాట్ ఐడీలు ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మిర్చి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు వ్యాపారులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి గురువారం మిర్చి కొనుగోళ్లు జరపాలని కోరారు.
నేడు మార్కెట్ బంద్..
ఈ–నామ్ సమస్య కారణంగా గురువారం వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. బుధవారం క్రయవిక్రయాలు పూర్తికాకపోవడం వల్ల మార్కెట్ బంద్ ప్రకటించామని, రైతులు మళ్లీ ప్రకటించే వరకు సరుకులను మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని కోరారు.
2.0వెర్షన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా రైతుల పడిగాపులు
మానుకోట మార్కెట్‌లో నిలిచిన మిర్చి కొనుగోళ్లు


