పది శాతం పనులు కూడా చేయలె..
ఎంజీఎం : రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పదిశాతం కూడా పూర్తి చేయలేదని, కేసీఆర్‌పై కక్షతో సీఎం రేవంత్‌రెడ్డి.. పనులు ఆలస్యం చేస్తూ పేదల ప్రాణాలను బలిగొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించారు. ఏ పనులు ఎంత వరకు వచ్చాయో కలియతిరిగి చూశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో 24 అంతస్తుల స్లాబ్ పూర్తయిందని, ఇప్పుడు ఏ పనీ జరగకపోవడంతో ఆస్పత్రిని చూస్తుంటే బాధేస్తుందన్నారు. 2024 దసరాకే ఆస్పత్రి ప్రారంభం కావాల్సి ఉందని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద చూపెడుతున్న శ్రద్ధలో కేసీఆర్ పేద ప్రజల కోసం నిర్మాణం చేపట్టిన హెల్త్ సిటీపై పదిశాతం శ్రద్ధ చూపితే ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదన్నారు. ఆస్పత్రి నిర్మాణంలో రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని నిర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించిందన్నారు. అదేవిధంగా రోడ్ నెట్‌వర్క్, ఎలివేషన్ వర్క్ వంటివి చాలా తగ్గించేశారని ఆరోపించారు. జూన్ 2వ తేదీన ఆస్పత్రి ప్రారంభిస్తామని చెబుతున్నారని, 2వేల పడకల ఆస్పత్రికి 2వేల మంది నర్సులు, 1,500 మంది వైద్యులు, వెయ్యిమంది పారామెడికల్ సిబ్బంది అవసరమనే విషయాన్ని కనీసం గుర్తించలేదన్నారు. ఆస్పత్రి సిబ్బంది నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందా..? నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైందా..? అంటూ మండిపడ్డారు. పేపర్లలో చేస్తే ఓపీ సేవలు ప్రారంభిస్తామని అని పేర్కొంటున్నారని, ఇది సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రా..? బస్తీ దవాఖానా..? అని మండిపడ్డారు. ఓపీ చూడడానికి ఈ ఆస్పత్రి ఎందుకు..? బీఆర్‌ఎస్ హయాంలో వరంగల్‌లో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశామని, కానీ ఇప్పుడు ఆస్పత్రిలో ఏసీలో నీళ్లు కారుతున్నాయనే సాంకేతిక లోపంతో థియేటర్లు మూసివేశారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ఎంజీఎంలో మూడు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుతం అవి పనిచేయని దుస్థితిలో కొనసాగుతున్నాయంటే పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
రెండున్నరేళ్లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు..
గతంలోని ధర్మశాల, ఎలివేషన్ వర్క్స్ తొలగించారు
రేవంత్‌రెడ్డిది ఫ్యూచర్ సిటీ ఆలోచన.. కేసీఆర్‌ది హెల్త్‌సిటీ ఆలోచన
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సందర్శన.. పనుల పరిశీలన
జర్నలిస్టులపై పగ పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం..
జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని హరీశ్‌రావు అన్నారు. రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అక్రిడిటేషన్ కార్డు ఇవ్వడం లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టులకు ప్రమాద బీమా ఇన్సూరెన్సుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు ఒక్క శాతం కాంట్రిబ్యూషన్‌తో, జర్నలిస్టులకు ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని గుర్తు చేశారు .కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నాయకులు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


