ఎన్‌ఆర్‌ఐల సేవాభావం గొప్పది
హన్మకొండ చౌరస్తా : మాతృభూమిపై ప్రేమతో తాను చదువుకున్న పాఠశాలలు, కళాశాలలకు సేవ చేయాలని తలచిన ఎన్‌ఆర్‌ఐల సేవాభావం గొప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఐల బృందంలో ఒకరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్‌రెడ్డిని మంగళవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ఎన్‌ఆర్‌ఐల బృందం హనుమకొండలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు 20 కంప్యూటర్లు అందించిందన్నారు. చదువుకున్న బడి, కాలేజీలకు సేవచేయాలని ప్రతీ పూర్వ విద్యార్థి సంకల్పించాలని కోరారు. కేఎంసీ భవనంతోపాటు ప్రహరీ నిర్మాణం కోసం మార్చిలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.5 కోట్ల నిధులు కోరనున్నట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ సుజిత్‌రెడ్డి మాట్లాడుతూ 1960 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో స్థిరపడిన వైద్యులు దాదాపు 200 మంది ఉన్నారన్నారు. వారందరి సహకారంతోనే రూ. 10 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఇవే కాకుండా ఎన్‌ఆర్‌ఐల బృందం పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం, లైబ్రరీ ఏర్పాటు లాంటి అనేక కార్యక్రమాలు నిర్విరామంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ కేఎంసీ నూతన భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థి డాక్టర్ సుజిత్‌రెడ్డి బృందం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల చైర్మన్ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
కేఎంసీ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు


