అచల చిట్‌ఫండ్ బాధిత సభ్యులకు చెక్కుల పంపిణీ
వరంగల్ లీగల్ : అచల చిట్ ఫండ్ బాధిత సభ్యులకు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ చేతుల మీదుగా సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. అర్హులైన 79 మంది లబ్ధిదారులకు రూ.3,67,27,224ల విలువైన చెక్కులు అందజేశారు. చిట్‌ఫండ్ యాజమాన్యం, బాధితుల పట్ల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం.సాయికుమార్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వ న్యాయవాది తీగల జీవన్ గౌడ్ పారదర్శకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి లబ్ధిదారులకు చిట్‌ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును తిరిగి చెల్లించేలా న్యాయసేవాధికార సంస్థ కృషి అభినందనీయమన్నారు. చిట్ ఫండ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించకుండా కార్యకలాపాలు చేయాలని సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని మరోసారి నిరూపించుకుందని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. సాయికుమార్, బాధితుల తరఫున న్యాయవాది వై. విశ్వేశ్వరరావు, అచల చిట్‌ఫండ్ తరపున సీనియర్ న్యాయవాది చొల్లేటి రామకృష్ణ, వరంగల్ జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరావు, అచల చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ పి.సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు.


