తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ!
● సుమారు 30 తులాల బంగారం, రూ.రెండు లక్షల నగదు అపహరణ
● మహదేవపూర్‌లో ఘటన..లబోదిబోమంటున్న బాధితులు
● ఘటనాస్థలిని పరిశీలించిన డాగ్‌స్క్వాడ్, పోలీసులు బృందాలు
కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌లో సోమవారం భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దుండగులు.. సుమారు 30 తులాల బంగారం, రూ.రెండులక్షల నగదు అపహరించారు. దీంతో బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దుబ్బగూడెంలో నివాసముంటున్న పోత సమ్మయ్య, వినోద దంపతులు ఇంటికి తాళం వేసి తమ మిరప చేనుకు వద్దకు వెళ్లారు. సమ్మయ్య సెల్‌ఫోన్ మర్చిపోయానని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉన్నాయి. ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా సామగ్రి చిందరవందరగా పడి ఉండడం గమనించాడు. బీరువా తాళం తీసి అందులో భద్రపరిచిన సుమారు 30 తులాల బంగారం, రూ. రెండు లక్షల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గమనించాడు. వెంటనే భార్య వినోదకు సమాచారం అందించగా ఆమె ఇంటికి చేరుకుని గుండెవిసేలా రోదించింది. ఉదయం 10.30 నుంచి 12 గంటల మద్యలో చోరీ జరిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తమ కుమారుడు ఇసుక క్వారీలో పనికి వెళ్లినట్లు చెప్పారు. తమ కుమార్తె వివాహం కోసం 20 ఏళ్లుగా బంగారం ఏటా కొంచెం కొనుగోలు చేస్తున్నామని, దొంగలు తమ బంగారం, నగదు దోచుకెళ్లారని గుండెలు బాధుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.
చోరీ చేసి బీరువా తాళం వేసి..
బీరువాలోని బంగారం, నగదును అపహరించిన అనంతరం దొంగలు తాళం వేసి చెవిని తమ వెంట తీసుకువెళ్లడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్‌కుమార్, సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలు, సెల్‌టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, బాధితుడు ఇంకా ఫిర్యాదు చేయలేదని సీఐ పేర్కొన్నారు.
బంగారం భద్రపరిచిన కవర్ ఇదే..
రోదిస్తున్న
బాధితురాలు వినోద
తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ!


