భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం
కురవి: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్పోత్సవం(పవళింపు సేవ) కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఉత్సవమూర్తులను అధీష్టింపజేసి గణపతి పూజ, గౌరీపూజ, పుణ్యహవచనము నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అందంగా పూలతో అలంకరించిన ఊయల వద్దకు మేళ తాళాలనడుమ ఉత్సవమూర్తులను తోడ్కొని వెళ్లి పవళింపుసేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి దంపతులు, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్ దంపతులు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య దంపతులు, ఆలయ ధర్మకర్తలు చిన్నం గణేష్, భిక్షపతి, జనార్ధన్‌రెడ్డి, అర్చకులు రెడ్యాల శ్రీనివాస్, పెనుగొండ అనిల్‌కుమార్, దూసకంటి విజయ్, పుణ్యమూర్తి, విజయ్, అభిలాష్, తేజ, బాలకృష్ణ, రమేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం
డోర్నకల్: హైదరాబాద్‌లో జరుగుతున్న సీఎం కప్ వెయిట్‌లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు బంగారు పతకం లభించింది. బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన ఎం.స్వాతి సోమవారం జరిగిన పోటీల్లో 58 కేజీల విభాగంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పథకం కై వసం చేసుకుంది. బంగారు పతకం సాధించిన స్వాతిని జిల్లా వెయిట్‌లిప్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మండలోజు సుధాకర్, సెక్రెటరీ కొత్త రాంబాబు తదితరులు అభినందించారు.
గోదావరి పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ములుగు: గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్ల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ అన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గోదావరి నది తీరం ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల ఏర్పాట్లపై పూర్తిస్థాయిలో నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యశిబిరాలు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తుతో పాటు ఇతర పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించే దిశగా ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలో మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెంలో పుష్కర ఘాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ప్రతీ పుష్కర ఘాట్ వద్ద భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో పుష్పోత్సవం


