పేదవర్గాల అభివృద్ధే లక్ష్యం
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కేటీఆర్ కాలనీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మాజ్యోతిరావుపూలే విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దళిత, గిరిజన, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అంబేడ్కర్ ఆలోచన విధానంతో ప్రతీ ఒక్కరు ఆర్థిక, సామాజిక, విద్య రంగాల్లో పురోగతి సాధించాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీలపై పెట్టిన కేసులపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాకు చేరుకున్న చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ అధికారులు శ్రీనివాసరావు, దేశీరాంనాయక్ స్వాగతం పలికారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ, దుడ్డెల రాంమూర్తి, అశోద భాస్కర్, శ్రీరాములు, మైస శ్రీనివాసులు, పులి శ్రీను, రాధ, సుధ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రాలు అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య


