టెన్త్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
మహబూబాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని చెప్పారు. జిల్లాలో 8,157 మంది విద్యార్థులు రాయనుండగా.. 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర సేవలకు వైద్యకేంద్రాలు, 108 వాహనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఈఓ రాజేశ్వర్, డీఎస్సీ తిరుపతి రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


