నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య రాక
హన్మకొండ: తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు జన్ను ప్రవీణ్, కుస్త్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ సోమవారం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయానికి రానున్నారు. సీఎండీ, డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో సమావేశం కానున్నారని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రమేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు, ఇబ్బందులపై తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారించనుందని తెలిపారు.
విద్యుదాఘాతంతో
వృద్ధుడి మృతి
భీమదేవరపల్లి : విద్యుదాఘాతంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని మల్లారంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీరామోజు వెంకటేశ్వర్లు (66) పిండిగిర్ని నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే ఆదివారం ఉదయం పిండిగిర్ని ఆన్ చేయడానికి స్విచ్ వేశాడు. ఈ సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కాల్వలో పడి వ్యక్తి..
ములుగు రూరల్ : కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మండంలోని బండారు పల్లి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన మీతాలాల్ టండి (55) కూలీ కోసం రెండు నెల క్రితం బండారు పల్లికి వచ్చి ఇక్కడ ఉన్న ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు వచ్చి తిరిగి ఇటుక బట్టీ వద్దకు వెళ్లలేదు. దీంతో సహచర కూలీలు మీతాలాల్ టండి కోసం గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బండారుపల్లి శివారులోని కాల్వలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కాల్వ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు స్నానం కోసం కాల్వలో దిగగా నీట మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు.మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
● రూ. 35వేల విలువైన మందులు స్వాధీనం
● ఆర్‌ఎంపీపై కేసు నమోదు
శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని క్లినిక్, మెడికల్ షాపులపై ఆదివారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ క్లినిక్‌లో అనుమతి లేని రూ. 35వేల విలువైన 30 రకాల మందులు లభ్యం కాగా స్వాధీనం చేసుకుని ఆర్‌ఎంపీ రాచర్ల ప్రభాకర్‌పై కేసు నమోదు చేసినట్లు డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఆర్‌ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దని, కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేసి పంపించాలన్నారు. బెడ్లు ఏర్పాటు చేయొద్దని, అనుమతి లేకుండా మందులు నిల్వ చేయొద్దన్నారు. డ్ర గ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జె. కిరణ్ కుమార్, వరంగల్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రా వణ్ కుమార్ ఉన్నారు.
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య రాక
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య రాక


