పోలీస్ వలయంలో సీఎం పర్యటన
కన్నాయిగూడెం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుపాలకుల గూడెం పర్యటన పోలీస్ వలయంలో కొనసాగింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామంలో ఉన్న జె. చొక్కారావు ఎత్తిపోతలను సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రులతో కలిసి సందర్శించారు. ఆదివారం మహబుబాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం 4.07 గంటలకు తుపాకులగూడెంలో గోదావరిపై ఏర్పాటు చేసిన సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్‌కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్ర ఘన స్వాగతం పలికారు. హెలిపాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో దేవాదులకు బయలుదేరారు. మార్గమధ్యలో సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ప్రవేశించి వెంటనే తన వాహనాన్ని దేవాదుల ఎత్తిపోతలకు మళ్లించారు. దీంతో అధికారులు, పోలీసులు కొంత తడబాటుకు గురయ్యారు. దేవాదుల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులు, మంత్రులతో కలిసి ఇంటెక్‌వెల్‌ను పరిశీలించిన అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం 5.49 నిమిషాలకు ప్రత్యేక వాహనంలో సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద ఉన్న హెలిపాడ్‌కు తిరిగి 6.05కు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, సమీక్ష జరుగుతున్న ప్రాంతంలో డ్రోన్‌లతో నిఘా ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టారు. కాగా, సీఎం సమీక్ష పూర్తయిన అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలు రోడ్డుపైకి చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తుపాకులగూడెంజీపీ నుంచి లక్ష్మీపురం జంక్షన్ వరకు వాహనాలు బారులుదీరాయి. దీంతో అధికారులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
దేవాదులకు ప్రత్యేక హెలికాప్టర్‌లో
ముఖ్యమంత్రి రాక
మంత్రులు, కలెక్టర్, పీఓ, ఎస్పీ
ఘన స్వాగతం


