విద్యతోనే సమాజంలో గౌరవం
మహబూబాబాద్ రూరల్: విద్య మనల్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుందని, విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కొత్త రెడ్యాల మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ రాజేశ్వర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల సమావేశాన్ని పరిశీలించి, విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేశ్వర్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ ప్రతీరోజు క్రమశిక్షణ తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు
చిన్నగూడూరు/మరిపెడ: ప్రణాళికతో చదివితే పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమని ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లా అ సిస్టెంట్ కమిషనర్ మందుల శ్రీరాములు అ న్నారు. చిన్నగూడూరు మండలంలోని జయ్యా రం జెడ్పీహెచ్‌ఎస్, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలను ఆయన శనివారం సందర్శించి టెన్త్ విద్యార్థులకు వార్షిక పరీక్షలపై మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నమూనా, ఓఎంఆర్ షీట్ వినియోగం, సమయపాలన వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు ‘బూస్ట్ అప్’ మోటివేషనల్ సెషన్ నిర్వహించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉపేందర్, స్వామినాథ్, రమాదేవి, అనంతరావు, రామ్మోహన్, జనార్ధనాచారి, శ్రీశైలం, నెహ్రూ, స్వప్న, తదితరులు ఉన్నారు.
కేఎంసీకి మరో మైలురాయి
ఎంజీఎం: ఎంజీఎం అనుబంధ కాకతీయ మెడికల్ కళాశాల మరో మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 100కు పైగా వైద్య సీట్లతో పాటు ఏటా సూపర్‌స్పెషాలిటీ సాధించాలనే లక్ష్యంతో కొనసాగుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేఎంసీ కళాశాలకు 10 సూపర్‌స్పెషాలిటీ సీట్లను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్ పేర్కొన్నారు. 20 రోజుల క్రితం సూపర్‌స్పెషాలిటీ సీట్ల మంజూరు కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇన్‌స్పెక్టర్లు ఎంజీఎంతోపాటు కేఎంసీలో తనిఖీలు నిర్వహించి నివేదిక కౌన్సిల్‌కు అప్పగించారు. నివేదిక ప్రకారం.. ఆస్పత్రితోపాటు కళాశాలలో సౌకర్యాలను గమనించి కార్డియాలజీ, కార్డి యోథెరాసిక్, వాస్కులర్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో రెండు సీట్ల చొప్పున 10 సూపర్ స్పెషాలిటీ సీట్లను మంజూరు చేసింది.
15కు చేరిన సూపర్‌స్పెషాలిటీ పీజీ సీట్లు
కళాశాల నెఫ్రాలజీ విభాగంలో 2023 సంవత్సరం నుంచి ఐదు సూపర్‌స్పెషాలిటీ సీట్లు కొనసాగుతున్నాయి. తాజాగా మంజూరైన పది సీట్లతో కేఎంసీలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంజీఎం వంటి ఆస్పత్రిలో పీజీ సీట్ల మంజూరు వల్ల పేదలకు లక్షలాది రూపాయలు విలువ చేస్తే సూపర్‌స్పెషాలిటీ సేవలు మెరుగుపడనున్నాయి. రెండు, మూడు నెలలో 2,000 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో సూపర్‌స్పెషాలిటీ మంజూరు కావడంతో వైద్యవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీట్లు మంజూరుపై కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్, ఎంజీఎం సూపరిండెండెంట్ హరీశ్చంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
విద్యతోనే సమాజంలో గౌరవం
విద్యతోనే సమాజంలో గౌరవం


