విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
● న్యాయం చేయాలని వేడుకుంటున్న
బాధిత కుటుంబ సభ్యులు
దామెర: విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని సింగరాజుపల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన వడ్డెపల్లి మొగిలి (62) పశువులకు మేత కోసం పచ్చిగడ్డి తీసుకురావడానికి రోజూ ఉదయం వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం బయటకు వెళ్లిన మొగిలి.. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రం సమీపంలో విద్యుదాఘాతానికి మొగిలి గురై విగతజీవిగా కనిపించాడు. దాంతో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. దామెర పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


