మున్సిపాలిటీల ఆదాయ వనరులివే.. | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల ఆదాయ వనరులివే..

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

మున్సిపాలిటీల ఆదాయ వనరులివే..

మున్సిపాలిటీల ఆదాయ వనరులివే..

తొర్రూరు: పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు మున్సిపాలిటీలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు రకాల నిధులు సమకూరుతాయి. ఆ నిధులతో నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలు మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకునే వీలుంటుంది.

ఆస్తి పన్ను

ఇది మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ స్థలాలపై అధికారులు ఆస్తి పన్ను విధిస్తారు.

ప్రకటనలు

విద్య, తదితర సంస్థల హోర్డింగ్‌లు, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేస్తుంటారు. వాటి నుంచి ప్రకటన పన్నులు వసూలు చేస్తారు.

నీటి పన్ను

పట్టణంలోని గృహాలకు తాగునీటి సరఫరా తో పాటు నల్లా కనెక్షన్‌కు సంబంధించినది.

లైసెన్స్‌ ఫీజులు

దుకాణాల లైసెన్స్‌లు, హోటళ్లు, సినిమా థియేటర్ల అనుమతులకు యజమానుల నుంచి కొంత రుసుం వసూలు చేస్తారు.

భవన నిర్మాణ అనుమతులు

కొత్తగా ఇళ్లు నిర్మించడం లేదా భవనాల ప్లాన్ల ఆమోదానికి వేసే పన్ను.

మార్కెట్‌ అద్దె

మున్సిపాలిటీ ఆధ్వర్యంలోని ఉన్న దుకాణ సముదాయాలు, సంతలు, మాంసపు దుకాణాల ద్వారా అద్దెల రూపంలో ఆదాయం అందుతుంది.

జరిమానాలు

నిబంధనల ఉల్లంఘన, స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వారికి జరిమానాలు వేస్తారు.

వినోదపు పన్ను

సినిమా టికెట్లు, ఇతర వినోద కార్యక్రమాల ద్వారా సమకూరే పన్నులోనూ మున్సిపాలిటీకి వాటా ఉంటుంది.

స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు

జనాభా సంఖ్యను బట్టి పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులను విడుదల చేస్తుంది. టీఎస్పీ (తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌) పేరిట డబ్బులు విడుదల చేస్తుంది. వాటిని పారిశుద్ధ్యానికి, వివిధ రకాల పరికరాలను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తారు. కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు తీర్మానం చేసిన తర్వాత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏఎస్పీ (అడిషనల్‌ స్టేట్‌ ఫైనాన్స్‌) పేరుతో వచ్చే డబ్బులతో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.

14వ ఆర్థిక సంఘం నిధులు

కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు విడతలుగా జనాభా సంఖ్యను బట్టి మున్సిపాలిటీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. ఇవి ఏప్రిల్‌ మొదటి వారంలో, డిసెంబర్‌ చివరలో నేరుగా మున్సిపాలిటీల ఖాతాలో జమవుతాయి. వాటితో వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు అవకాశం ఉంటుంది.

ప్లానింగ్‌, నాన్‌ ప్లానింగ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి వివిధ రకాల కార్యక్రమాలు అమలు చేస్తాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్‌, మన పట్టణం, ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతం చేసి ఆయా వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి వీటిని వినియోగిస్తారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు

మున్సిపాలిటీల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాల వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరు చేస్తుంది. వాటిని ఆ వర్గానికి చెందిన వార్డుల్లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక నిధులతో

పురపాలికల అభివృద్ధి

నూతన పాలక మండళ్లకు సదావకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement