విహారయాత్రకు ముఖ్యమంత్రి, మంత్రులు
హన్మకొండ: దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా కేటాయించని సీఎం రేవంత్‌రెడ్డికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించే అర్హత లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. హనునుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ రెండేళ్లుగా దేవాదుల ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని, చుక్క నీరు ఇవ్వలేదని తూర్పారబట్టారు. దేవాదుల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి జిల్లా రైతులను కాంగ్రెస్ మోసం చేసి గెలిచిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, మంత్రుల వైఫల్యం దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శాపంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒక్క పంపుహౌస్ కూడా సరిగా నడపలేకపోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రుల నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు దేవాదుల నీళ్లు సరిపడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటనతో ప్రభుత్వం నిద్రలేచిందని ఎద్దేవా చేశారు. గోదావరి నదిలో సరిపడా నీళ్లు ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంతో గోదావరి నీళ్లు రైతులకు అందించడం లేదని విమర్శించారు. 90 శాతం ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిచేస్తే రెండున్నరేళ్లుగా ఒక్క శాతం పని కూడా రేవంత్ రెడ్డి సర్కారు చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై విమర్శలు చేయడానికే ముఖ్యమంత్రికి, మంత్రులకు రెండేళ్లు సరిపోయిందని ఎద్దేవాచేశారు. ఇప్పుడేమో విహార యాత్రకు వస్తున్నారని విమర్శించారు. పెద్ది సుదర్శన్ వెంట నాయకులు పులి రజనీకాంత్, జోరిక రమేష్, రామ్మూర్తి, రఘు, తదితరులు ఉన్నారు.
దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయీ కేటాయించని రేవంత్ రెడ్డి
బీఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నేత,
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి


