కమనీయం.. ప్రతిష్ఠాపనోత్సవం
భూపాలపల్లి / రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా జరిగింది. శనివారం తెల్ల వారుజామున 4 గంటలకు ఆలయం ముందు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఉదయం 9గంటలకు ఆరాధన సేవాకాలం, ద్వారతోరణం పూజ, చతుఃస్థానార్చన, హోమం, మహా పూర్ణాహుతి, 9.41 గంటలకు ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 60 మంది వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య లక్ష్మీనరసింహాస్వామి, మహాలక్ష్మి, ఆండాళ్ ఆళ్వార్ల ప్రతిష్ట, నాగేంద్ర సంవలిత, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం, మహా కుంభాభిషేకాన్ని కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ నాయినేని సంపత్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని, వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయాభివృద్ధికి ప్రభుత్వం రూ.12.15 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయాన్ని మరో యాదాద్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ ఈఓ మహేష్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా లక్ష్మీనరసింహస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన
చినజీయర్ స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు
కమనీయం.. ప్రతిష్ఠాపనోత్సవం
కమనీయం.. ప్రతిష్ఠాపనోత్సవం


