చరిత్ర.. భవిష్యత్‌కు దృఢమైన పునాది
కేయూ క్యాంపస్: చరిత్ర అనేది గతాన్ని నమోదు చేసే ప్రక్రియ మాత్రమే కాదని, వాస్తవ ఆధారాలపై నిలిచే పరిశోధన ద్వారానే భవిష్యత్‌కు దృఢమైన పునాది వేయవచ్చని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న 9వ వార్షిక తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ సమావేశం.. కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్ హాల్‌లో శనివారం ప్రారంభమైంది. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రామచంద్రం మాట్లాడుతూ వరంగల్ నగరం తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. కాకతీయుల కళాసంపద నుంచి ఆధునిక సామాజిక ఉద్యమాల వరకు ఈ నేల చరిత్రకు సాక్ష్యమని వివరించారు. సోషల్‌సైన్స్ డీన్ ప్రొఫెసర్ సురేష్‌లాల్ మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన సమాజాల చరిత్రలను వెలికితీయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకట్రాజం, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంకం జయప్రకాశ్ మాట్లాడుతూ 2007వ సంవత్సరం నుంచి సంస్థ విస్తృత వ్యాప్తికి కృషి చేస్తున్నామని, ఈ సంస్థలో 400 మందికి పైగా శాశ్వత సభ్యులున్నారని తెలిపారు. తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ, కేయూ హిస్టరీ విభాగం అధిపతి డాక్టర్ చిలువేరు రాజ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ దయాకర్, ప్రొఫెసర్ పాండ్య భూక్య, సిక్కిం యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయకుమార్, ప్రొఫెసర్ దయాకర్‌రావు, ప్రొఫెసర్ రాజశేఖర బాబు, ప్రొఫెసర్ లావణ్య, ప్రొఫెసర్ వన్నం, ప్రొఫెసర్ బండి శ్రీనివాస్, ప్రొఫెసర్ మనోహర్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ వార్షిక సమావేశాల నివేదికను అతిథులు ఆవిష్కరించారు.
కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం
తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ప్రారంభం


