దేవన్నపేట వద్ద నీళ్లు ఎత్తిపోస్తున్నారు
హసన్‌పర్తి: దేవాదుల నుంచి ధర్మసాగర్ చెరువులోకి నీళ్లు ఎత్తిపోస్తున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా దేవన్నపేట వద్ద పంపుహౌజ్‌ను నిర్మించారు. గంగారం నుంచి టన్నల్ ద్వారా దేవన్నపేటలోని పంపుహౌజ్‌లోకి నీరుచేరిన తర్వాత సుమారు 150మీటర్ల లోతు నుంచి మోటార్ల ద్వారా నీటిని ధర్మసాగర్‌లోకి పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకు దేవన్నపేట వద్ద నిర్మించిన పంపుహౌజ్ వద్ద మూడు మోటార్లు బిగించారు. ఒక్కో మోటారు సుమారు రోజుకు 530 క్యూసెక్కుల నీటిని తోడుతుంది. వారం రోజులు పాటు నిరంతరంగా ఒక మోటారును రన్ చేస్తే చెరువు మట్టం గరిష్టస్థాయికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
సాంకేతిక సమస్యతో నిలిచిన పంపింగ్
ఇటీవల మోటార్లలో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల చెరువులోకి నీటి పంపింగ్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ముంబాయిలోని సాంకేతిక నిపుణులకు కబురు పంపారు. అలాగే, దేవన్నపేట పంప్‌హౌజ్‌ను మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. సమస్య పరిష్కారం అనంతరం శనివారం ఉదయం మోటార్లు ఆన్‌చేసి ధర్మసాగర్ చెరువులోకి నీటి పంపింగ్‌ను అధికారులు ప్రారంభించారు.
సాంకేతిక కారణాలతో
పంపింగ్ నిలిచిపోయింది
సాంకేతిక కారణాల వల్ల పంపింగ్ నిలిచిపోయింది. ముంబాయి నుంచి సాంకేతిక నిపుణులు శుక్రవారం రాత్రి వచ్చి సమస్యను పరిష్కరించారు. అనంతరం నీటిని చేరువులోకి విడుదల చేశాం. ప్రస్తుతం ఒక మోటారు నడుస్తోంది.
– మంగీలాల్, ఈఈ, నీటిపారుదల శాఖ


