లింక్ కెనాల్ పనులు నిలిపేయాలి
గార్ల: గార్ల సమీపం నుంచి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే లింక్ కెనాల్ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీని వాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి గార్లలోని 5వ వార్డులో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్నేరు ఏటిపై లింక్ కెనాల్ నిర్మాణం చెపడితే గార్ల మండల రైతుల భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. లింక్ కెనాల్ జీఓ 98ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గార్ల మండలం సస్యశ్యామలం అయ్యే విధంగా, ముల్కనూరు పంచాయతీలో రెండు ఏర్లు (మున్నేరు, అలిగేరు) క లిసేచోట మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించవచ్చన్నారు. రాష్ట్ర మంత్రి పాలేరు నియోజకవర్గానికి నీటిని తరలిస్తే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్‌నాయక్, కోకన్వీనర్లు జడ సత్యనారాయణ, రాధాకృష్ణ, సక్రు, శీలంశెట్టి రమేశ్, గిన్నారపు మురళి, జంపాల విశ్వ, కత్తి సత్యం, మొగిలి వెంకన్న, విమల్‌జైన్, ఇర్రి రవి, బాధిత రైతులు ఆగాల రామారావు, వీరభద్రం, గోపి, శ్రీను, శ్రీకాంత్ పాల్గొన్నారు.


