నైపుణ్యంతో పరీక్షలు నిర్వహించాలి
● డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్
నెహ్రూసెంటర్: ల్యాబ్ టెక్నీషియన్లు వ్యాఽధి నిర్ధారణలో నైపుణ్యం పెంపొందించుకుని సమయానికి పరీక్షలు నిర్వహించడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు అనుమానిత క్షయ రోగుల శ్లేష్మం సేకరణ, పరీక్షల నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. క్షయవ్యాధి నిర్మూలనలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమన్నారు. స్మియర్ మైక్రోస్కోపి, సీబీ నాట్ పరీక్షలు, బయోసేఫ్టీ నియమాలు, రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. జిల్లాలో క్షయవ్యాధి నియంత్రణకు సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజ య్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, నీలిమాశ్వేత, అశోక్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.
టెన్త్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో మార్చి 14నుంచి ఏప్రిల్ 16వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలపై సీఎస్, డీఓఎస్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లాలో 45 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామని, తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రశ్నపత్రాల రవాణా, సీలింగ్‌లపై జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతీ పరీక్ష కేంద్ర వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలన్నారు. సీఎస్, డీఓఎస్, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షలకు హాజరయ్యే విధంగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, పరీక్షల టైం టేబుల్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగ అధికారి మందలు శ్రీరాములు, డీఎస్‌ఓ అప్పారావు, సీఎస్‌ఓ, డీఓఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.
మేడారం జాతరపై పుస్తకం విడుదల
ములుగు రూరల్: మేడారం మహాజాతర సమ్మక్క–సారలమ్మపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకం ప్రచురించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌లో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరలో అరుదైన చాయాచిత్రాలను సంకలం చేసి పుస్తకంగా రూపొందించిన ప్రముఖ చిత్ర నిర్మాత నర్సింగరావు, ట్రస్ట్ సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, బీపీ పాపారావు, రిటైర్డ్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీధర్, రిటైర్డ్ డీజీపీ రతన్ జె పూలెలను మంత్రి ప్రశంసించారు. సమ్మక్క–సారలమ్మ జాతరను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి అవసరమయ్యే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు.
మార్చి 5న జాబ్‌మేళా
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో మార్చి 5న హనుమకొండలోని గిరిజన భవన్‌లో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివిన నిరుద్యోగులకు అవకాశం ఉంటుందన్నారు. గిరిజన నిరుద్యోగులు మార్చి 5న ఉదయం 10గంటలకు హనుమకొండ గిరిజన భవన్‌కు బయోడెటా, సర్టిఫికెట్స్‌ను నేరుగా తీసుకొని హాజరు కావాలని కోరారు.
నైపుణ్యంతో పరీక్షలు నిర్వహించాలి


