వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : కారు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామ శివారు ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దీపిక శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గూడూరు మండలం అప్పరాజుపల్లి గ్రామ శివారు పుట్లంపాడు తండాకు చెందిన మాలోతు నరేష్ (28) జిల్లా కేంద్రంలో వివిధ కూలీ పనులు చేస్తూ కుటుంబంతో నివాసముంటున్నాడు. ఈక్రమంలో అవసరం నిమిత్తం స్వగ్రామమైన పుట్లంపాడు తండా గురువారం వెళ్లి తిరిగి బైక్ పైనే మానుకోటకు వస్తున్నాడు. ఈక్రమంలో జమాండ్లపల్లి గ్రామ శివారు ముత్యాలమ్మగూడెం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన కారు నరేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన అతడిని వారి తండాకు చెందిన అజ్మీరా భరత్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించాడు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతిచెందాడు. నరేష్ భార్య కల్పన ఫిర్యాదు మేరకు రూరల్ హెడ్ కానిస్టేబుల్ తుంగ పిచ్చయ్య కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారని ఎస్సై తెలిపారు.
వనపర్తి శివారులో..
లింగాలఘణపురం: మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డు వనపర్తి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన బోయిని కొంరయ్య (62) అక్కడికక్కడే మృతిచెందగా.. కొడకండ్ల మండలం నీలిబండతండాకు చెందిన అంగోతు రమేష్‌కు గాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంరయ్య, రమేష్ ద్విచక్ర వాహనంపై జనగామ నుంచి కొడకండ్లకు వెళ్తుండగా కొడకండ్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న వి.శ్రీనివాసురెడ్డి కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కొంరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ర మేష్ గాయపడగా.. 108 అంబులెన్స్‌లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
ద్విచక్రవాహనంపై నుంచి పడి..
చెన్నారావుపేట: శుభకార్యానికి ద్విచ్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల పరిధిలోని లింగగిరి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. లింగగిరి గ్రామానికి చెందిన ఓరుగంటి నర్సింగరాములు (65) కందిగడ్డతండాకు ఓ శుభకార్యానికి హాజరుకావడానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో నెక్కొండ– గూడూరు ప్రధాన రహదారిపై వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌రెడ్డి తెలిపారు.
బావిలో పడి వృద్ధురాలు..
సంగెం: లేగదూడకు గడ్డి తేవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రా ధమ్మ(75) గురువారం లేగదూడకు గడ్డి తేవడానికి ఇంటి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. వ్యవసాయ పనులకు వెళ్లిన కుమారుడు, కోడలు వచ్చేసరికి రాధమ్మ కనిపించకపోవడంతో వెతకడం ప్రా రంభించారు. బావి పరిశీలించగా.. శవమై కన్పించింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు.
బైక్‌ను లారీ ఢీకొని వ్యక్తి..
ఖిలా వరంగల్: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి బైక్‌ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈఘటన శుక్రవారం ఉదయం మామునూరు పోలీస్ స్టేషన్ పరిధి ఐనవోలు కామన్ వైన్ షాపు ఎదుట చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన చిదురాల కొమురయ్య (52) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు వారీగా బైక్‌పై శుక్రవారం ఉదయం గర్మిళ్లపల్లి గ్రామం నుంచి వరంగల్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఐనవోలు కామన్ వైన్ షాపు ఎదురు చేరుకోగానే వర్ధన్నపేట వైపు నుంచి వరంగల్ వైపు వచ్చే రాజస్థాన్ రాష్ట్రం జావుర జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ లాల్‌పదం అతివేగంగా వెళ్తూ అదపు లారీతో బైక్‌ను ఢీకొట్టడంతో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య చిదురాల దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మానుకోట, లింగాలఘణపురంలో కారు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. బావిలోపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతిచెందాడు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి మృతి


