ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీ
● పట్టించుకోని పోలీసులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జమాండ్లపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడ్డి మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి కి సంబంధించిన ఐదు క్వింటాళ్ల మిర్చి గురువారం అర్ధరాత్రి చోరీకి గురైంది. మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు 5 ఎకరాల వ్యవసాయంలో మిర్చి సాగు చేయగా రెండు ఎకరాల మేరకు పంట నష్టపోయారు. మిగిలిన మూడు ఎకరాల్లో వచ్చిన దిగుబడిని విక్రయించడం కోసం గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో అరబోశారు. కొద్దిరోజుల్లో ఎండిన మిర్చిని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 క్వింటాళ్ల మిర్చిని అపహరించారు. దీంతో సుమారు రూ.90 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. జమాండ్లపల్లి గ్రామానికి చెందిన మోడెం రాములు, కొమ్ము రవి, కాలసాని శ్రీనివాస్ రెడ్డి, పుల్యాల వెంకటరెడ్డితోపాటు మరి కొంతమంది రైతులకు చెందిన మిర్చిసైతం ఈమధ్యకాలంలో చోరీకి గురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.
బైక్ చోరీల ముఠా అరెస్ట్
ఎల్కతుర్తి: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పట్టుబడి నిందితుల్లో వరంగల్ ఉర్సు కరీంబాద్‌కు చెందిన షేక్ సల్మాన్, మహబూబాద్ జిల్లాకు చెందిన బూక్య చందులాల్‌తోపాటు మరో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హనుమకొండలోని కాపువాడ, అలంకార్, రాయపుర ప్రాంతాల్లో నివసిస్తూ పరస్పర స్నేహం ఏర్పరుచుకున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. పార్క్ చేసి హ్యాండిల్ లాక్ చేయని ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకొని వరంగల్ కమిషనరేట్ పరిధితోపాటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో మొత్తం 14 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు వెల్లడించారు. కాగా ఎల్కతుర్తిలో నమోదైన రెండు కేసులపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మండల కేంద్రం సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలను అంగీకరించినట్లు తెలిపారు. హనుమకొండ, రాయపుర ప్రాంతాల్లో దాచిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబర్చిన ఎస్సై ప్రవీణ్‌కుమార్, ఏఎస్సై శంకర్, ఉబేదుల్లా, సిబ్బంది బక్కయ్య, అఖిల్, సుమన్, గణేష్, వికిల్, రంజిత్, స్వరూపను అభినందించారు.
వ్యక్తిపై పోక్సోకేసు నమోదు
బయ్యారం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన వ్యక్తిపై బయ్యారం పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన భూక్య హుస్సేన్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. సదరు యువతి పెళ్లి చేసుకోవాలని కోరడంతో నిరాకరించాడు. దీంతో హుస్సేన్‌పై యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.
ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీ
ఐదు క్వింటాళ్ల మిర్చి చోరీ


