భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు
● రూ.5వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు ఉద్యోగులు
భూపాలపల్లి అర్బన్: ప్రజలకు న్యాయం అందించాల్సిన న్యాయస్థానంలో లంచావతారులు ర్యాజ మేలుతున్నారు. వివిధ కేసులతో కోర్టుకు వస్తున్న వారిని కొంతమంది అధికారులు, సిబ్బంది లంచా ల కోసం వేధిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బాధితుడి నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటున్న ఇన్‌చార్జ్ ఏఓ, స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయిచరణ్, ఆఫీస్ సబార్డి నేట్లు పున్నం రజిత, కొమ్ము సునీతను ఏసీబీ అధి కారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ రైతుకు కర్కపల్లి శివారులో 14.2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిని పక్కనే ఉన్న రైతు 1984 వ సంవత్సరంలో భూ రికార్డులోకి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. 1985 సంవత్సరం నుంచి బాధిత రైతు కోర్టు చుట్టు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 2025 అక్టోబర్ 25న వాదనలు విన్న భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధిత రైతుకు భూమి వర్తించేలా తీర్పు వెల్లడించారు. ఈ క్రమంలో సర్టిఫై కాపీ కోసం కోర్టులో సంబంధిత విభాగం అధికారి సాయిచరణ్ వద్దకు వచ్చి వెళ్తున్నాడు. రూ.20 వేలు ఇస్తేనే సర్టిఫై కాపీ ఇస్తామని ఈనెల 10న ఆయన తేల్చిచెప్పాడు. బాధిడుతు ఏసీబీ అధి కారులను ఆశ్రయించి వారి సూచన మేరకు శుక్రవా రం రైతు డబ్బులు ఇచ్చేందుకు సాయిచరణ్ వద్దకు వెళ్లి సర్టిఫై కాపీ అడిగాడు. దీంతో అటెండర్లకు డబ్బులు ఇచ్చిన కాపీ తీసుకెళ్లమని సూచించాడు. అటెండర్లు రజిత, సునీతకు డబ్బులు అందజేస్తుండగా.. అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టిన అనంతరం వీరిని శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు, పి.ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.


