అమ్ముకోలేక.. పారబోయలేక
కొత్తగూడ: ఆరుగాలం కష్టించి పండించిన టమాటను మార్కెట్‌లో అమ్ముకోలేక.. పారబోయలేక రైతులు అంగడిలో ఉచితంగా పంచి పెట్టిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని అంగడిలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన నలుగురు రైతులు టమాట సాగు చేశారు. పండించిన టమాటను కూలీలతో తెంపించి వంద బాక్సులు తీసుకుని తెల్లవారుజామున నర్సంపేట కూరగాయల మార్కెట్‌లో విక్రయించేందుకు వెళ్లారు. 25 కిలోల బాక్సు రూ.50కి విక్రయించేందుకు సిద్ధపడినా ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో కొత్తగూడలో జరిగే అంగడిలోనైనా అమ్ముకుంటే కనీసం ఆటో కిరాయిలైనా వస్తాయేమోనని అనుకున్నారు. మధ్నాహ్నం వరకు అంగడిలో వేచి చూశారు. టమాట బాక్సు కొనే నాథుడు కరువయ్యాడు. దీంతో ఉచితంగా పంచితే వారైనా తిని తలుచుకుంటారని భావించారు. ఒక్కసారిగా టమాట ఫ్రీ.. ఫ్రీ అంటూ వచ్చినవారికందరికీ పంచిపెట్టి కంటనీరు దిగమింగుతూ వెళ్లిపోయారు.
కొత్తగూడ అంగడిలో
ఉచితంగా టమాట పంపిణీ
కిలో రూ.2 కూడా పలకని పరిస్థితి


