భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
రఘునాథపల్లి: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కుర్చపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నీరటి వెంకటయ్య తన కూతురు లత (34)ను మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు యాదగిరికి ఇచ్చి 2012 సంవత్సరంలో పెళ్లి చేశాడు. రూ.3 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు వర్షిత్, హాసిని ఉన్నారు. కొన్నాళ్లుగా యాదగిరి భార్య లతను తల్లి ఇంటినుంచి బంగారం తీసుకురావాలని, భూమి రాసి ఇవ్వాలని వేధించేవాడు. పెద్ద మనుషులు సర్ధిచెప్పినా వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన లత ఈ నెల 19(గురువారం) వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగింది. స్థానికులు గుర్తించి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. తన కూతురు వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిందని అల్లుడు యాదగిరి, అత్త, మామలు వెంకటయ్య, ఎల్లమ్మ, మరిది అశోక్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లత తండ్రి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.


