ఖోఖో ఇండియన్ క్యాంపునకు మనోళ్లు
● ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి మార్చి 9వ తేదీ వరకు గుజరాత్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరికి చెందిన గుగులోత్ దినేశ్, ములుగు జిల్లా మల్లంపల్లి మండలం గుర్తూరుతండాకు చెందిన గుగులోత్ అఖిల ఇండియన్ క్యాంపునకు ఎంపికై నట్లు ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది క్రీడాకారులు పాల్గొనే ఇండియన్ క్యాంపునకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపికవడం హర్షణీయమన్నారు. సుమారు పదిహేను రోజుల శిక్షణలో ప్రతిభ కనబరిస్తే మార్చి 9 నుంచి 14 వరకు ఘనా దేశంలో జరగనున్న కామన్వెల్త్ ఖోఖో ప్రపంచ కప్ పోటీలకు ఎంపికవుతారని తెలిపారు. అందులో 24 దేశాల నుంచి ఖోఖో జట్లు పాల్గొంటాయని, ప్రపంచకప్ పోటీలకు మన ఓరుగల్లు క్రీడాకారులు ఎంపికవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఖోఖో ఇండియన్ క్యాంపునకు మనోళ్లు


