ఆరేళ్లలో 61 జిల్లాల నుంచి ఐదు జిల్లాలకు... మార్చిలోగా న
ఓ వైపు అభివృద్ధి, మరోవైపు అణచివేత..
పార్లమెంట్‌లో తాజా నివేదికలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడి
సాక్షిప్రతినిధి, వరంగల్: 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామన్న లక్ష్యం వైపు అడుగులు వడివడిగా సాగినట్లు కేంద్రం పేర్కొంది. రెండేళ్లుగా సీరియస్‌గా అమలవుతున్న ‘నక్సల్స్ రహిత దేశం’మిషన్ సక్సెస్‌కు సమీపంలో ఉన్నట్లుగా కేంద్ర హోంశాఖ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ తదితర 10 రాష్ట్రాల్లోని 61 జిల్లాలు 245 పోలీసుస్టేషన్‌ల పరిధిలో వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష తీవ్రవాదంపై సీరియస్‌గా దృష్టి సారించిన కేంద్రం దండకారణ్యంలో బేస్‌క్యాంపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 2020లో కర్ణాటకలో జీరోకు తేవడంతోపాటు 53 జిల్లాలు, 226 పోలీసుస్టేషన్‌ల పరిధికి తగ్గించి మిగతా చోట్ల కట్టడి చేశారు. 2025 జనవరి 15 నాటికి ఛత్తీస్‌గఢ్‌లో 3 జిల్లాలు, జార్ఖండ్‌లో 2 జిల్లాల్లోని 11 పోలీసుస్టేషన్‌లో పరిధిలో స్వల్పంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు గుర్తించారు. మార్చి నాటికి నక్సల్స్ రహిత దేశంగా భారత్ ఉంటుందని రెండు రోజుల క్రితం ప్లారమెంట్‌లో సమర్పించిన తాజా నివేదికలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.
2019 నుంచే స్కెచ్..
బేస్‌క్యాంపులతో ముందుకు..
తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని ఏజెన్సీలు మావోయిస్టుల కీలకప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఉద్యమం అణచివేత లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్‌ఏబీ) క్యాంపులకు 2019లో శ్రీకారం చుట్టింది. మొదటి సంవత్సరంలో 24 బేస్ క్యాంపులను ఏర్పాటు చేసిన కేంద్ర బలగాలు (సీఆర్‌పిఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ, ఐటీబీటీ).. 2020లో 40, 2021లో 51, 2022లో 66.. ఇలా ఆరేళ్లలో 379లకు పెంచాయి. అంటే అడవిలో ప్రతీ 5–15 కిలోమీటర్లకో అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, ప్రత్యేక శిక్షణ పొందిన 200 – 400 మంది భద్రతా బలగాలకు సౌకర్యంగా ఉండే విధంగా శిబిరాలను నెలకొల్పారు. బేస్‌క్యాంపుల ఆధారంగా కేంద్ర బలగాలు చేసిన దాడుల్లో 145 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మృతిచెందగా, 1,276 మంది పోలీసులకు చిక్కారు. 440 మంది స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ నివేదికలో పేర్కొంది. ఇలా ఆరేళ్లలో మొత్తం 1,158 మంది ఎన్‌కౌంటర్‌లలో మృతి చెందగా, 7,530 మందిని అరెస్టు చేశారు. 5,881 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారు.
కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ) ప్రభావిత ప్రాంతాల్లో కార్యకలాపాల కట్టడికి బహుముఖ వ్యూహాన్ని రూపొందించింది. గిరిజన, మారుమూల ప్రాంతాలలో అభివృద్ధిపై దృష్టి సారించడం నక్సలిజం అంతానికి పరిష్కారంగా ప్రకటించి.. మెరుగైన శాంతిభద్రతలు, భద్రతా పరిస్థితి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహదారులను నిర్మాణం, విద్య, వైద్యం, మంచినీటి పథకాలకు రూ.కోట్లు వెచ్చించింది. భద్రతా బలగాల శిక్షణా అవసరాలు, లొంగిపోయిన వామపక్ష తీవ్రవాద కార్యకర్తల పునరావాసం, హింసలో మరణించిన పౌరుల కుటుంబాలకు, భద్రతా బలగాల సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా మొదలైన వాటి కోసం మొత్తంగా రూ.3523.48 కోట్లు ఖర్చు చేశారు. ప్రత్యేక బలగాలు, రాష్ట్ర గూఢచార విభాగాలు (ఎస్‌ఐబీ), ఆయా జిల్లాల పోలీసులు, పటిష్టమైన పోలీస్ స్టేషన్ల (ఎఫ్‌పీఎస్) నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు రూ. 1757 కోట్ల పనులు మంజూరు చేశారు.
సమాంతర ప్రభుత్వం నుంచి
అంతిమ ఘడియల వరకు..
సుమారు 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టు పార్టీకి అంతిమ ఘడియలు సమీపించినట్టు కేంద్ర ప్రభుత్వం నివేదికలో ప్రకటించింది. ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగిసిన మావోయిస్టు పార్టీ.. కేంద్ర కమిటీ, దండకారణ్యానికి చెందిన కీలక నేతల ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో అతలాకుతలమవుతోంది. దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యం, కర్రెగుట్టల్లో ఇక ఉద్యమ నినాదాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఇదే సమయంలో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపుగా చివరి దశకు చేరినట్లుగా కూడా కేంద్ర హోంశాఖ నివేదికలో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
మావోయిస్టుల కట్టడికి కీలకంగా
బేస్‌క్యాంపులు
2019 నుంచే దండకారణ్యంలో
అణచివేతకు శ్రీకారం..
ఆరేళ్లలో రూ.5,280 కోట్లు..
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు
1,158 మంది ఎన్‌కౌంటర్.. 7,530
మంది అరెస్టు, 5,881 మంది సరెండర్
తెలంగాణలో ఉనికే లేదు.. గోదావరి పరీవాహక ప్రాంతంపై నిఘా


