క్రీడా పండుగకు వేళాయె..
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడా పండుగకు వేళ అయ్యింది. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభంకానున్నాయి. 32 ఈవెంట్లలో నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఫలితంగా క్రీడాకారులతో స్టేడియం సందడిగా మారింది. కాగా, రాష్ట్ర స్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలకు జేఎన్ స్టేడియం సిద్ధంగా ఉందని హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ పోటీల వివరాలు వివరించారు.
సబ్‌జూనియర్స్, జూనియర్స్,
సీనియర్స్ కేటగిరీల్లో పోటీలు..
ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు, 66 మంది కోచ్‌లు, 27 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారు. ఒక్కో జిల్లా నుంచి 21 మంది బాలురు , 21 మంది బాలికలు పోటీల్లో పాల్గొంటుండగా, సబ్‌జూనియర్స్, జూనియర్స్, సీ నియర్స్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. నాలుగు రోజులు కొనసాగే అథ్లెటిక్స్ పోటీల్లో 32 ఈవెంట్లలో క్రీడాకారులు తమ ప్రతిభ చాటనున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించారు.
నేటినుంచి జేఎన్‌ఎస్‌లో సీఎం కప్
అథ్లెటిక్స్ పోటీలు
నాలుగు రోజులు.. 32 ఈవెంట్లు
33 జిల్లాల నుంచి 1,518 అథ్లెట్లు హాజరు


