యామిని.. స్ఫూర్తి దాయకం | - | Sakshi
Sakshi News home page

యామిని.. స్ఫూర్తి దాయకం

Feb 20 2026 6:35 AM | Updated on Feb 20 2026 6:35 AM

యామిన

యామిని.. స్ఫూర్తి దాయకం

నల్లబెల్లి: ఆ వయస్సులో పిల్లలు సీతాకోక చిలుకల్లా గాలిలో తేలుతూ పరుగులు తీయాలి. కానీ ఆ చిన్నారికి అడుగుతీసి అడుగు వేయడమే యుద్ధంగా మారింది. దీనికి కారణం స్థూలకాయంగా ఉండమే. అయితే ఆ చిన్నారి ఈ సమస్యకు ఏమాత్రం చింతించలేదు. శరీరం సహకరించకున్నా.. తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహంతో గుండెనిండా ఆత్మవిశ్వాసం నింపుకుంది. పుట్టుకతోనే ఉబకాయం శాపంగా మారినా ఆ అడ్డంకిని దాటి పారా క్యారం పోటీల్లో సత్తా చాటేందుకు ముందుకుసాగుతోంది. ఆ చిన్నారే వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లూనావత్‌ యామిని.

నడక భారమైనా.. లక్ష్యం వైపు అడుగులు

బుచ్చిరెడ్డిపల్లికి చెందిన లూనావత్‌ దేవిసింగ్‌,తారా దంపతుల కుమార్తె యామిని ప్రస్తుతం నల్లబెల్లిలోని శ్రీవిద్యానికేతన్‌ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. పుట్టుకతోనే బరువు పెరుగుదల సమస్యతో బాధపడుతోంది. ఈ చిన్నారి ప్రస్తుతం 90 కిలోల బరువు ఉంది. తోటి పిల్లలు మైదానంలో ఆడుతుంటే చూసి మురిసిపోయే యామిని.. తన శరీర ఇబ్బందులను చూసి కుంగిపోలేదు. నడకే భారంగా మారిన తరుణంలో క్రీడల పట్ల యామినికి ఉన్న ఆసక్తిని గుర్తించిన పాఠశాల యాజమాన్యంతోపాటు పీఈటీ దేవేందర్‌ తనలోని ప్రతిభను వెలికి తీసేందుకు పారా క్యారం గేమ్‌లో కొంతకాలంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ పోటీల్లో తన సత్తా చాటేందుకు ముందుకొచ్చింది. అలా వచ్చి మండల, జిల్లా స్థాయి పారా క్యారం పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. అడ్డంకులను అధిగమించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచింది. త్వరలోనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. శారీరక సమస్యలున్న పారా క్రీడాకారిణులు దీప్తి జీవాంజి, శీతల్‌ దేవిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతోంది.

కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు.

తమ కూతురి శారీరక బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని యామిని తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. నిరుపేద కుటుంబ కావడంతో కార్పొటేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించే స్థోమత తమకు లేదన్నారు. అయినా తమ కూతురు ధైర్యం కోల్పోకుండా రాష్ట్ర స్థాయి పారా క్యారం పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వేడుకుంటున్నారు.

ప్రశంసల జల్లు..

యామినిని పాఠశాల యాజమాన్యం, మండల పరిషత్‌ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు గురువారం వేర్వేరుగా సన్మానించారు. ఎంపీఓ పసరగొండ రవి, శ్రీ ఆదర్శ వాణి విద్యా సంస్థల చైర్మన్‌ నాగనబోయిన రవి మాట్లాడుతూ అంగవైకల్యం, శారీరక సమస్యలు క్రీడలకు అడ్డుకావని యామిని నిరూపించిందని కొనియాడారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించొచ్చని చాటుతున్న ఈ చిన్నారి సాహసాన్ని ప్రతీ ఒక్కరు అభినందిస్తూ అండగా ఉండాలని కోరారు.

స్థూలకాయాన్ని జయించి..

పారా క్యారం పోటీల్లో రాష్ట్ర స్థాయికి

ఎంపికైన చిన్నారి

తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షం

నడక భారమైనా.. లక్ష్యం వైపు అడుగులు

యామిని.. స్ఫూర్తి దాయకం1
1/1

యామిని.. స్ఫూర్తి దాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement