పాలకవర్గంపైనే భారం..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో 18వేలకు పైగా జనాభా ఉంది. చాలా రోజులుగా వీధులకు చెత్త సేకరణ వాహనాలు రావడం లేదు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. మెయిన్ రోడ్డు, బ్యాంక్ స్ట్రీట్‌లలో రోడ్లపైకి దుకాణాలు చేరడం, సైడ్ కాల్వలు ఆక్రమించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సైడ్ కాల్వల ఆక్రమణతో వ్యర్థాలు, మురుగును తొలగించే అవకాశం లేక తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరాకు తరచూ అంతరాయం కలగడం, పలు వీధుల్లో తాగునీటి పైప్‌లైన్ పగలడంతో స్థానికులు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూరగాయల మార్కెట్, గాంధీ సెంటర్, జెడ్పీ స్కూల్ ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మున్సిపాలిటీ డంపింగ్ యార్డు లేకపోవడంతో బందంకుంట ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చారు.
తాగునీటి సమస్య పరిష్కరించాలి
నెహ్రూస్ట్రీట్‌కు తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్ సక్రమంగా లేకపోవడంతో నిత్యం తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నాం. మా తాగునీటి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యపై నూతన పాలకవర్గం దృష్టి సారించాలి.
– వై.శ్రీనివాసరావు, నెహ్రూస్ట్రీట్, డోర్నకల్


