నాడు ఎంపీటీసీ.. నేడు చైర్‌పర్సన్
అప్పుడు భాస్కర్‌రెడ్డి.. ఇప్పుడు బాలమణి
● నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ‘డ్రా’ ద్వారా చైర్మన్
జనగామ: జనగామ మున్సిపాలిటీ చరిత్రలో అరుదైన రాజకీయ వాతావరణం మరోసారి వెలుగు చూసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వీరారెడ్డి భాస్కర్‌రెడ్డి, రొండ్ల లక్ష్మారెడ్డికి సమాన ఓట్లు రావడంతో లాటరీ విధానంలో డ్రా తీసి భాస్కర్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అదే ఘటన ఇప్పుడూ పునరావృతమైంది. ప్రస్తుత(2026) ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతినే అనుసరించాల్సి వచ్చింది. నియమ నిబంధనల ప్రకారం ఎన్నికాధికారులు లాటరీ విధానాన్ని అమలు చేయగా, చరిత్ర మరోసారి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
తొమ్మిది మంది మహిళలే..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పాలకవర్గంలో తొమ్మిది మంది మహిళలు ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. 2వ వార్డు, 4, 5, 6, 10, 11, 14వ వార్డు మహిళలకు రిజర్వ్ కాగా, 1, 13వ వార్డులు జనరల్ స్థానాల్లో మాదా లావణ్య, ఎల్లావుల సువర్ణ పోటీ చేసి విజయం సాధించారు. చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులు కూడా మహిళలనే వరించగా పార్టీల పరంగా కాంగ్రెస్ నుంచి ఏడుగురు, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
డోర్నకల్: తాజా మున్సిపల్ ఎన్నికల్లో డోర్నకల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన కొండేటి రాజకుమారి గతంలో ఎంపీటీసీ సభ్యురాలిగా పని చేశారు. 2006 నుంచి 2011 ఎంపీటీసీగా పని చేసిన రాజకుమారి.. 15 సంవత్సరాల తర్వాత రాజకీయ పునరాగమనం చేశారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు సభ్యురాలిగా గెలుపొంది చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
నాటి సర్పంచ్ నేటి వైస్ చైర్‌పర్సన్..
మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికై న మాదా లావణ్య 2014 నుంచి 2019 వరకు డోర్నకల్ సర్పంచ్‌గా పని చేశారు. గతంలోనూ లావణ్య వార్డు సభ్యురాలిగా పని చేశారు.


