సంక్షేమాన్ని సమగ్రంగా చూడాలి
● రిజిస్ట్రార్ రామచంద్రం
● కేయూలో ముగిసిన జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : సంక్షేమాన్ని కేవలం రాజకీయ కోణంలోనేకాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల్లో సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉందని, సంక్షేమం రాజ్యాంగ హక్కుల్లో అంతర్భాగంగా ఉండాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘పాపులిస్టు పాలిసీస్ ఇన్ పోస్టులిబరలైజేషన్ ఇండియా’ అనే అంశంపై రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సదస్సు మంగళవారం సాయంతం ముగిసింది. ఈ ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశం ఒక వెల్ఫేర్ స్టేట్ అని పేర్కొన్నారు. సంక్షేమం దీర్ఘకాలిక అభివృద్ధిలో వ్యూహంగా ఉండాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్. సుకుమార్ అన్నారు. కార్పొరేట్ వర్గాలకు బ్యాంకు, ఇతరత్రా రుణాలు మాఫీచేసిన ప్రభుత్వాలు.. ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మితిమీరిన జనాకర్షక పథకాలు సముచితం కాదని వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్‌అన్నారు. పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి సంకినేని వెంకటయ్య, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్ మల్లికార్జున్‌రెడ్డి, యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ టి. మనోహర్, బోర్డు ఆఫ్‌స్టడీస్ చైర్మన్ గడ్డం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వివిధచోట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలు సమర్పించారు. జాతీయ సదస్సుకు సంబంధించి పరిశోధనాపత్రాలతోకూడిన బుక్‌లెట్‌ను రిజిస్ట్రార్, ఇతర అతిథులు ఆవిష్కరించారు.


