జనగామలో 26 వార్డుల్లో ఒక్కటీ గెలవని బీజేపీ
జనగామ: జనగామ పుర ఎన్నికల్లో కమలం పార్టీ అత్యంత చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ఒక్క వార్డు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. అంతేకాకుండా, ప్రచార సమయంలోనే నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం, కొందరు నాయకుల ఒంటెద్దు ధోరణి, అంతర్గత విభేదాలతో పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. గెలుపు అవకాశాలున్న రెండు స్థానాల్లో పార్టీనేతలే అంతర్గతంగా గండి పెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్ ప్రశ్నార్థకం..
ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఈ విభేదాలు మరింతగా ఎగసిపడినట్లు సమాచారం. ఓటమికి కారణాలపై ఒకరిపై ఒకరు నిందలు వేస్తున్నారని పార్టీ వర్గాలు చె బుతున్నాయి. 26 స్థానాల్లో కలిపి పార్టీకి కేవలం 2,416 ఓట్లు మాత్రమే రావడంతో జనగామలో కమలం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో మూడు పర్యాయాలు అధికారం, రాష్ట్రంలో ఎనిమిది ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నా.. హై దరాబాద్‌కు అతి సమీపంలోని జనగామ వంటి జిల్లా కేంద్రంలో బీజేపీ గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థాయికి పడిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బలమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ పలువురు స్థానిక నాయకులు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండటంపై ఆ పార్టీలో ఉన్న విభేదాలను ఎత్తి చూపిస్తుంది.
బీజేపీకి 2,416.. స్వతంత్రులకు 4,143 ఓట్లు
గత పురపాలక ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈసారి ఒక్క సీటు కూడా సాధించకపోవడం గమనార్హం. అంతేకాకుండా సాధారణంగా పార్టీకి వచ్చే ఓట్లకన్నా కూడా చెప్పుకో లేని స్థితిలో ఓట్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల ప్రభావం కూడా ఎక్కువనే చె ప్పాలి. బీజేపీ 2,416 ఓట్లు సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 4,143 ఓట్లు సాధించి కమలం పార్టీపై ఒక మెట్టు పైన నిలి చారు. స్వతంత్రులు కష్టపడి పని చేయగా, జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ మాత్రం ఎందుకు పనితీరు చూపలేకపోయిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ఓటమి కమలం పార్టీలో మార్పుకు గుణపాఠమవుతుందా.. లేదా అనేది వేచిచూడాలి.
ప్రచారంలోనే చేతులెత్తేసిన నేతలు
ఎన్నికలకు దూరంగా ముఖ్య నాయకులు
స్వతంత్రులకంటే తక్కువ ఓట్లు సాధించిన కమలం


