కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ ఆందోళన
● రీకౌంటింగ్ చేయలేదని అధికారులపై ఆరోపణ
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 12వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి గుండె స్వప్నిక గెలిచినా.. కాంగ్రెస్ అభ్యర్థి తిరుపల్లి వాణి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారని రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టినా చేయలేని బీఆర్‌ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రం ఎదుట ధర్నా చేసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ ఒత్తిడికి అధికారులు తమ విధులను దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వరకు చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, నాయకుడు పూజారి రఘు మాట్లాడుతూ.. తాము కౌంటింగ్ వద్ద ఉన్న సమయంలో తమకు చూపించకుండానే బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టారని తెలిపారు. స్వప్నిక 7 ఓట్లతో గెలుపొందారని ఓ అధికారి తెలిపారని.. ఇంతలోనే కాంగ్రెస్ అభ్యర్థి వాణి 13 ఓట్లతో గెలిచినట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యామన్నారు. రీ కౌంటింగ్ చేయాలని ఎంత చెప్పినా అధికారులు వినలేదన్నారు. ఒక సందర్భంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అనుమానాలు ఉంటే న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాలని ఆందోళన చేయొద్దని అధికారులు చెప్పారని పోలీసులు ఆందోళనకారులకు తెలిపారు.


