నామినేషన్ల స్వీకరణ షురూ
● 5 మున్సిపాలిటీల్లో 13 దాఖలు
● కేంద్రాలను పరిశీలించిన అధికారులు
మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మానుకోటలో 10, డోర్నకల్‌లో రెండు, మరిపెడలో ఒక నామినేషన్ దాఖలైంది. తొర్రూరు, కేసముద్రంలో ఒక్కటి కూడా దాఖలు కాలేదు. మానుకోట మున్సిపాలిటీకి చెందిన నామినేషన్ల స్వీకరణ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. 36 వార్డులకు గాను 12 కౌంటర్లు ఏర్పాటు చేసి స్వీకరించారు. తొలిరోజు 10 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల సరళిని ఆర్డీఓ కృష్ణవేణి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రాజేశ్వర్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, టీపీఓ సాయిరాం పాల్గొన్నారు. టౌన్ సీఐ గట్ల మహేందర్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు.
డోర్నకల్‌లో ఒకటే..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపల్ కార్యాలయంలో ఐదు నామినేషన్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఒకటో వార్డు నుంచి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ నిరంజన్, తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి పరిశీలించారు.
ఒక్కటీ దాఖలు కాలే..
తొర్రూరు/కేసముద్రం: తొర్రూరులో 16 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణను తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాటుచేశారు. 8 కౌంటర్లు ఏర్పాటుచేశారు. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా రాలేదని మున్సిపల్ కమిషనర్ వి.శ్యామ్‌సుందర్ తెలిపారు. కేసముద్రం మున్సిపల్‌లో 16 వార్డులకు ఎనిమిది కౌంటర్లు ఏర్పాటుచేశారు. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.
మరిపెడలో రెండు..
మరిపెడ: మరిపెడలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరో వార్డులో బోడ స్వామి దామోదర్, తొమ్మిదో వార్డులో బర్మావత్ దేవి దాఖలు చేశారు.
నామినేషన్ల స్వీకరణ షురూ


