తెల్లబోయిన ‘ఎర్ర’బంగారం
● మిర్చిపంటకు తెగుళ్లు
● తగ్గిన దిగుబడులు
● నష్టపోతున్న రైతులు
గార్ల: ఆరుకాలం కష్టపడి పండించిన మిర్చిపంటకు తెగుళ్లు సోకడం, మద్దతుధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడులు కూడా తగ్గడంతో అన్నదాతలు కోలుకోవడం లేదు. జిల్లాలో 31,871 ఎకరాల్లో రైతులు మిర్చిపంట సాగుచేశారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. నల్లతామర పురుగు ఆశించడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడి భారీగా తగ్గింది. మూడేళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. మరోపక్క పండిన కొద్దిపాటి మిర్చి పంటకు సైతం గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నల్ల తామర పురుగు నివారణకు రెండు రోజులకు ఒకసారి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఎన్ని పురుగు మందులు పిచికారి చేసినా నల్లి తెగులు తగ్గడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనికి తోడు మిర్చి తోటలకు వేరుకుళ్లు, ఎండు తెగులు కూడా ఆశించాయి. దిగుబడి డబ్బులు కూలీలకే సరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


