ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో రోడ్డు ప్రమాదాలు
● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనేనని ఎస్పీ శబరీష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో రోడ్డు భద్రతా నియమాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ప్రతీ వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం పోలీసు ఉద్యోగులు ముందుగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ అడ్మిన్ గండ్రతి మోహన్, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ఆర్‌ఐ భాస్కర్, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, టౌన్ ఎస్సై ప్రశాంత్, జిల్లా పోలీసు కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.


