మేడారం జనసంద్రం
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, కర్ణాటక నుంచి భక్తులు వాహనాల్లో మేడారానికి లక్షలాదిగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ మొదలవగా 11 గంటల వరకు మేడారం అంతా కిక్కిరిపోయింది. మేడారం వచ్చే రహదారులన్ని ప్రైవేట్ వాహనాలతో బారులుదీరాయి. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల దర్శనానికి క్యూ కట్టారు. ఉదయం 10 గంటల వరకు గద్దెల పైకి భక్తులను దర్శనం కోసం అనుమతించిన పోలీసులు అనంతరం రద్దీ పెరగడంతో గద్దెల గేట్లకు అమర్చిన గ్రిల్స్ బయటి నుంచి దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తులు క్యూలో అమ్మవార్లను దర్శించుకున్నప్పటికీ చాలా మంది భక్తులు దారి తెలియక ఇబ్బంది పడ్డారు. సుమారు 5లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
వనమంతా భక్తుల సందడి
మేడారం దర్శనాలకు వచ్చిన భక్తులు మొక్కుల అనంతరం వంటావార్పు కోసం సమీపంలోని వనాల్లో విడిది చేశారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వచ్చే మార్గంలో సుమారు 6 కిలోమీటర్ల మార్గంలో, చుట్టూ పక్కల అటవీ మార్గాలు, నార్లాపూర్ చింతల్ క్రాస్, వెంగళాపూర్, చిలుకలగుట్ట, మేడారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. పస్రా నుంచి మేడారానికి వచ్చే క్రమంలో 6 కిలోమీటర్ల మేర భక్తుల వాహనాలు బారులదీరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పస్రా నుంచి తాడ్వాయి మీదుగా వాహనాలు మళ్లించి ట్రాఫిక్‌కు నియంత్రించారు. భక్తుల తాకిడి పెరుగుతుందనే ముందస్తు అంచనాతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మేడారానికి వచ్చే మా ర్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు 300 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.
ఎత్తు బంగారంతో భక్తురాలు
అమ్మవార్లకు భారీగా మొక్కుల చెల్లింపు
ఒకే రోజు 5 లక్షల మంది దర్శనం
వనమంతా భక్తుల సందడే..
మేడారం జనసంద్రం
మేడారం జనసంద్రం
మేడారం జనసంద్రం
మేడారం జనసంద్రం


